రోడ్డు భద్రత.. అందరి బాధ్యత
భువనగిరిటౌన్ : రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌లో జిల్లాలో రోడ్డుభద్రతపై సంబంధింత అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఎన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి? వాటి పై తీసుకున్న చర్యలు ఏమిటని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో మరణించినవారి సంఖ్య తగ్గిందన్నారు. గత సంవత్సరం రోడ్డు ప్రమాదాల వల్ల మరణించిన వారి సంఖ్య 204 ఉండగా ఈ సంవత్సరం 174 మంది మాత్రమే చనిపోయినట్లు వివరించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్ లను గుర్తించి రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాద ప్రదేశాలలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాద అవకాశం ఉన్న స్థలాల్లో వాహనాల వేగ నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. నేషనల్ హైవే అథారిటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రోడ్ సేఫ్టీ సమావేశాల్లో చర్చించిన అంశాలకు సంబంధించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏఎస్పీ రాహుల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించామన్నారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ రెడ్డి, ట్రాన్స్‌పోర్ట్ అధికారి సాయి కృష్ణ, రోడ్లు భవనాల శాఖ అధికారి సరిత, ఆర్‌టీఏ నర్సింహ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు


