మాంజా తగిలి యువకుడి గొంతుకు గాయం
ఆలేరు : చైనా మాంజా తగిలి పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన చింతకింది భరత్(26) గొంతుకు గాయమైంది. భరత్ శుక్రవారం సాయంత్రం బైక్‌పై క్రాంతినగర్‌లోని ఇంటికి వెళుతుండగా రైల్వే ఫ్‌లైఓవర్‌పైన అతడి గొంతుకు చైనా మాంజా తగిలి కోసుకు పోయింది. తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో స్థానికులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.
మంజా తగిలి గొంతుకు గాయం
ఆత్మకూరు(ఎం) : మంజా తగిలి బాలిక గొంతుకు గాయమైన ఘటన ఆత్మకూరు(ఎం) మండలం మొరిపిరాలలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన హేమలత భర్త పరశురాములు, అయిదు సంవత్సరాల కూతురు భానుశ్రీ కలిసి సంక్రాంతి పండుగకు పుట్టింటికి వచ్చింది. పరశురాములు బైక్‌పై భానుశ్రీని గ్రామంలోని షాపునకు తీసుకెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తుండగా బైక్ ముందు కూర్చున్న భానుశ్రీ గొంతుకు మంజా తగిలి కోసుకు పోయింది. గాయపడిన బాలికను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
చైనా మాంజా విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు
చౌటుప్పల్ : నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తున్న వ్యక్తిపై శుక్రవారం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ పట్టణం బంగారిగడ్డ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ఎండీ.అమీర్(23) స్థానిక గాంధీపార్క్‌లో పతంగులు విక్రయిస్తున్నాడు. అతడి వద్ద నిషేధిత చైనా మాంజా ఉందన్న సమాచారంతో పెట్రోలింగ్ పోలీసులు దాడిచేశారు. అతడి వద్ద వివిధ రకాల 53 చర్కాలు లభించాయి. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.


