ఎగిరే గాలిపటం.. బృంద స్ఫూర్తి సంబరం
ఫ సొంతంగా గాలిపటాలు తయారు
చేసుకోవడంతో చిన్నారుల్లో
పెరగనున్న సృజనాత్మకత
తిరుమలగిరి (తుంగతుర్తి) : పర్వదినాల్లో సంక్రాంతికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రజలు సంబరాలకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. చిన్నారులు, యువకులు, మహిళలు, వృద్ధులు ఈ పండగొస్తుందంటే భలే సంతోషపడతారు. సందడి చేస్తారు. పిల్లలైతే పది రోజుల ముందు నుంచే గాలిపటాలను ఎగురవేస్తూ పండగ వాతావరణాన్ని సృష్టిస్తారు. విద్యాలయాలకు సెలవులు ప్రకటించకముందే పల్లె, పట్టణ ప్రాంత ప్రజలు రంగురంగుల పతంగులను ఎగురేస్తూ సంతోషంగా గడుపుతారు. పతంగుల సంబరంలో నింగికెగసే వీరి సంతోషం వెనుక సృజనాత్మకత, ఆరోగ్య సూత్రాలు, బృద స్ఫూర్తి ఇమిడి ఉంటాయని పెద్దలు చెబుతుంటారు.
రూపకల్పనలో సజనాత్మకత..
కొంతమంది చిన్నారులు గాలిపటాలను వారే తయారుచేసుకుంటారు. కొంత మంది పిల్లలు ఒకచోట చేరి పేజీలను తీసుకొని చతురస్రం, దీర్ఘచతురస్రం ఆకారంలో కత్తిరించుకొని ఇంటి దగ్గర దొరికే పుల్లలతో అందంగా గాలిపటాలు తయారుచేస్తారు. దీని ద్వారా వారిలో మైత్రి బంధం పెరుగుతుంది.
జట్టుగా పని..
గాలిపటం ఎగురవేసేటప్పుడు లక్ష్యం నింగికై నా కేకలతో ఆహ్లాదకర పోటీతత్వం కనిపిస్తుంది. గాలికి పతంగి బరువు తప్పుతున్నప్పుడు పక్కనే ఉన్న స్నేహితులు పసిగడుతుంటారు. ఒకరు ఎగురవేస్తుంటే మరొకడు దారం వదులుతారు. ఆనందంలో అక్కడ వారి బృద స్ఫూర్తి కనిపిస్తుంది.


