అనుమానాస్పద స్థితిలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి
మునగాల : ట్రాక్టర్ డ్రైవర్ బావిలో శవమై తేలిన ఘటన మునగాల మండలం మాధవరం గ్రామంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధవరం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ దేశగాని అశోక్(35) మంగళవారం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో శవమై కనిపించాడు. చుట్టుపక్క రైతులు బావిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
కొండమల్లేపల్లి : తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో జరిగింది. వివరాలు.. కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని వాసవీ బజార్‌లో నివసిస్తున్న కానమోని నాగరాజు సోమవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి తన అమ్మమ్మ గ్రామమైన పెండ్లిపాకలకు వెళ్లాడు. తిరిగి మంగళవారం ఉదయం 7గంటలకు వచ్చి చూసేసరికి తలుపులు పగలగొట్టి ఉండడంతో పాటు ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.67వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అజ్మీరా రమేష్ తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ పరిశీలించి వివరాలు సేకరించారు.
నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
భువనగిరి : మండలలోని పెంచికల్‌పహాడ్ గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెంచికల్‌పహాడ్ గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి తల్లిదండ్రులు రోజు మాదిరిగా ఉదయం కూలీ పనికి వెళ్లారు. ఆ చిన్నారి ఇంటి వద్ద నానమ్మతో ఉండిపోయింది. మధ్యాహ్నం సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిని అటుగా వచ్చిన అదే గ్రామానికి చెందిన సిలివేరు ఎల్లయ్య తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సాయంత్రం చిన్నారి మూత్రవిసర్జన సమయంలో నొప్పిగా ఉందని నాయనమ్మకు చెప్పింది. దీంతో నాయనమ్మ ఏం జరిగిందని చిన్నారిని అడగగా జరిగిన విషయం తెలిపింది. చిన్నారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపారు. చిన్నారిని చికిత్స నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.


