స్కూటీని ఢీకొట్టిన కారు.. ఇద్దరికి గాయాలు
కొండమల్లేపల్లి : మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో మంగళవారం సాయంత్రం కారు అదుపుతప్పి స్కూటీని, స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తితో పాటు రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేసుకునే మహిళకు గాయాలయ్యాయి. వివరాలు.. హైదరాబాద్ నుంచి అనుములకు కారులో వెళ్తున్న వ్యక్తి కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో యూటర్న్ తీసుకుంటుండగా.. అదుపుతప్పి స్కూటీపై వెళ్తున్న నాంపల్లి మండలం సల్సాపురం గ్రామానికి మెండె నరేష్‌ను ఢీకొని బస్టాండ్ వద్ద ఉన్న స్తంభాన్ని కూడా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో మెండె నరేష్ కాలు ఫ్యాక్చర్ కాగా చుట్టుపక్కల వారు 108 సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ అజ్మీరా రమేష్ తెలిపారు.
పెట్రోల్ బంకుల్లో తనిఖీలు
భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి పట్టణ కేంద్రంతో పాటు జలాల్‌పురంలోని పెట్రోల్ బంకుల్లో మంగళవారం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి రోజా, డీటీ బాలమణి తనిఖీలు చేపట్టారు. కొలతల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా అని పరిశీలించారు. పెట్రోల్ నాణ్యతలో, కొలతల్లో ఏమైనా తేడాలొస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.


