50 మందిపై కేసు | - | Sakshi
Sakshi News home page

50 మందిపై కేసు

Jan 14 2026 11:19 AM | Updated on Jan 14 2026 11:19 AM

 50 మందిపై కేసు

50 మందిపై కేసు

స్లాట్‌ బుకింగ్‌ కుంభకోణంలో

భువనగిరిటౌన్‌ : భువనగిరి తహసీల్దార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్టాంప్‌డ్యూటీ మళ్లింపు విషయంలో 9 మందిపై కేసు నమోదు చేసినట్టు భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌కుమార్‌ తెలిపారు.

చౌటుప్పల్‌ : భూ భారతి కుంభకోణానికి చౌటుప్పల్‌ కేంద్ర బిందువుగా మారింది. దీనిపై తహసీల్దార్‌ వీరాభాయి, డిప్యూటీ తహసీల్దార్‌ పజ్జూరు సిద్ధార్ధకుమార్‌, గతంలో ఇక్కడ పని చేసి బదిలీ అయిన తహసీల్దార్‌ హరికృష్ణలు పోలీస్‌స్టేషన్‌లో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. డాక్యుమెంట్‌ రైటర్‌ బాతరాజు తరుణ్‌ వెనుక మరో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టు సమాచారం.

భూ భారతి పోర్టల్‌లోని ఎడిట్‌ ఆప్షన్‌ ఆధారంగా చోటుచేసుకున్న భారీ కుంభకోణంలో జిల్లాలో 50 మందిపై కేసు నమోదైంది. ఇందులో డాక్యుమెంట్‌ రైటర్లు ఇంటర్‌నెట్‌ నిర్వాహకులు ఉన్నారు. ఇంటర్నెట్‌ సెంటర్‌, కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ నిర్వాహకులు భూమి యజమానుల నుంచి చలానా మొత్తం వసూలు చేసి ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్‌ విలువ ప్రకారం చెల్లించాల్సిన స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చలానా మొత్తం ప్రభుత్వానికి చెల్లించలేదు.

రాజాపేట: భూభారతి ధరణి స్లాట్‌ బుకింగ్‌లో పలు ఆన్‌లైన్‌ కేంద్రాల నిర్వాహకులు జెల్ల పాండు, జెల్ల పావని, నార భాను, పసునూరి బస్వరాజు, గోపగాని శ్రీనాథ్‌, శ్రీకాంత్‌, రేహాన్ష్‌లు అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించి తహసీల్దార్‌ ఫిర్యాదుమేరకు ఏఎస్‌ఐ మైసయ్య చీటింగ్‌ కేసు నమోదు చేశారు.

మోటకొండూర్‌ : మోటకొండూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో 59 డ్యాకుమెంట్‌లకు సంబంధించి స్లాట్‌ బుక్కింగ్‌లో ఫ్రాడ్‌ జరిగినట్లు గుర్తించారు. అక్టోబర్‌ 2024 నుంచి నేటి వరకు ఈ స్లాట్‌ బుకింగ్‌ ద్వారా రూ.18.952 లక్షలు ప్రభుత్వానికి గండి పడినట్లు డీటీ జయమ్మ తెలిపారు. అక్రమాలకు పాల్పడిన ఆన్‌లైన్‌ సెంటర్ల నిర్వాహకులు ఆలేటి నాగరాజు, నాగరాజు, మల్గ లావణ్య, దుంపల కిషన్‌, పసునూరి బసవరాజు, భానులపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

యాదగిరిగుట్ట రూరల్‌: డాక్యుమెంట్‌లల్లో అక్రమాలకు పాల్పడిన ఆన్‌లైన్‌ సెంటర్‌ నిర్వాహకులు బస్వరాజ్‌, భాను, దేవేందర్‌, శ్రీకాంత్‌, పాండు, పావని, భానుచందర్‌, నాగరాజు, కృష్ణ,నాగరాజు లపై యాదగిరిగుట్టలో రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మండలంలో 212 డాక్యుమెంట్‌లో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ డాక్యుమెంట్లకుగాను చలానా ఫీజు రూ.74,75868 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ. 2,77482 లక్షలు మాత్రమే చెల్లించినట్లు అధికారులు తెలిపారు. కాగా రూ.71,98386 లక్షలు ప్రభుత్వ ఖజానాకు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు.

ఆత్మకూరు(ఎం): స్లాట్‌లో అక్రమాలకు పాల్పడిన ఆత్మకూర్‌ మండల కేంద్రానికి చెందిన డాక్యుమెంట్‌ రైటర్‌పై తహసీల్దార్‌ వి. లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి మండలంలో భూభారతి పోర్టల్‌ ద్వారా భూ రిజిస్ట్రేషన్‌ల స్లాట్‌ బుకింగ్‌ చలాన్లలో అక్రమాలకు పాల్పడిన చౌటుప్పల్‌కు చెందిన డాక్యుమెంట్‌ రైటర్‌ తరుణ్‌పై తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. 2024 నవంబర్‌ నుంచి మార్చి 2025 వరకు భూమి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన సుమారు రూ.12.92 లక్షల ఆదాయానికి గండి కొట్టారని చెప్పారు.

వలిగొండ : వలిగొండలో భూభారతిలో స్థాంపు డ్యూటీ ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడ్డ స్థానిక స్టాంప్‌ వెండర్స్‌ కల్కూరి మధు, ఎం .భువనేశ్‌, పి. బసవరాజు, రాజు, రాఖేష్‌, శివరామ కృష్ణ, తరుణ్‌పై తహసీల్దార్‌ దశరథ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 41 స్లాట్లలో రూ.15,58,472 తక్కువ చెల్లించినట్లు తెలిపారు.

ఆలేరు: రిజిస్ట్రేషన్‌ రుసుమును పక్కదారి పట్టించిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆలేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తహసీల్ధార్‌ ఆంజనేయులు మంగళవారం తెలిపారు.

గుండాల: జనగామ జిల్లా కొడకండ్లకు చెందిన కె.సత్యనారాయణ, బీబీనగర్‌ మండలానికి చెందిన నరేష్‌లు గుండాల మండలం అనంతారం, వెల్మజాల, బ్రాహ్మణపల్లి, సుద్దాలకు చెందిన 8 మంది రైతుల భూ రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ బుకింగ్‌ చేసినట్లు చెప్పారు. 8 స్లాట్‌లకు రూ.1.97 లక్షల 772 ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ సదరు డాక్యుమెంట్‌ రైటర్లు రూ.9807 మాత్రమే చెల్లించి మిగతావి కాజేశారని తెలిపారు. సదరు ఆన్‌లైన్‌ నిర్వాహకులపై తహసీల్దార్‌ ఎస్‌.హరికృష్ణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ తేజమ్‌రెడ్డి కేసు నమోదు చేశారు.బొమ్మలరామారం మండలంలో అక్రమాలకు పాల్పడిన డాక్యుమెంట్‌ రైటర్‌ దొమ్మాట శంకర్‌తో పాటు కొండ భాను చందర్‌, నల్ల శ్రీకాంత్‌లపై తహసీల్దార్‌ శ్రీనివాస్‌ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement