గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల
సాక్షి, యాదాద్రి: సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ పంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇటీవల జిల్లాలోని 427 గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఏడు నెలలుగా గ్రాంటు లేక గ్రామ పంచాయతీలు ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. మంగళవారం ఆర్థిక శాఖ నిధులను విడుదల చేసింది. ఈ నిధులను బుధవారం గ్రామ పంచాయతీ ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. అనంతరం సర్పంచ్, ఉపసర్పంచ్‌ల సంతకాలతో డ్రా చేసి గ్రామ అవసరాలకు ఖర్చు చేయవచ్చునని అధికారులు చెబుతున్నారు.
విద్యా ప్రగతిని మెరుగుపర్చేందుకే ‘జట్టు’
ఫ కలెక్టర్ హనుమంతరావు
భువనగిరి(బీబీనగర్): పదో తరగతిలో విద్యార్థుల విద్యా ప్రగతిని మెరుగుపర్చేందుకే జట్టు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. మంగళవారం బీబీనగర్ మండలం కొండుమడుగ గ్రామంలో విద్యార్థుల జట్టు ఏర్పాటుచేసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పదోతరగతి.. విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతో కీలకమైందన్నారు. ప్రతి గ్రామంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు, విద్యావంతులైన యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జట్టుగా ఏర్పడాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులు మంచి వాతావరణ పరిస్థితులు కల్పించాలన్నారు. ప్రతి రోజు తెల్లవారు జామున 4 గంటలకు లేచి చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకం
ఫ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
భువనగిరిటౌన్ : మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణలో ప్రతీ ఒక్క అధికారి పాత్ర కీలకమైనదని, సమన్వయంతో విధులు నిర్వహించాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలన్నారు. నామినేషన్ల స్వీకరణ నుంచి ఫలితాల ప్రకటన వరకు తీసుకోవాల్సిన చర్యలు, నిర్వర్తించాల్సిన బాధ్యతలకు సంబంధించి ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు చెక్ లిస్ట్ తయారుచేసుకోవాలన్నారు .ఈ కార్యక్రమం లో రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి , మాస్టర్ ట్రైనర్లు నర్సిరెడ్డి, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


