షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రింటింగ్‌ ప్రెస్‌ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రింటింగ్‌ ప్రెస్‌ దగ్ధం

Jan 13 2026 7:20 AM | Updated on Jan 13 2026 7:20 AM

షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రింటింగ్‌ ప్రెస్‌ దగ్ధం

షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రింటింగ్‌ ప్రెస్‌ దగ్ధం

తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మండల కేంద్రంలోని సమతా ప్రింటింగ్‌ ప్రెస్‌లో సోమవారం తెల్లవారుజామున విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రింటింగ్‌ మిషన్లు, ప్రింటర్లు, కంప్యూటర్లు, కౌంటర్‌లో ఉన్న రూ.4500 కాలిబూడిదయ్యాయి. రూ.2లక్షల నష్టం వాటిల్లినట్లుదుకాణ యజమాని గుండు కిరణ్‌కుమార్‌ తెలిపారు.

ఇంట్లో సామగ్రి..

నార్కట్‌పల్లి : మండలంలోని మాధవఎడవెల్లి గ్రామానికి చెందిన ఎడమ మల్లేష్‌ ఇంట్లో సోమవారం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగి సామగ్రి కాలిపోయాయి. ఇంట్లోని విద్యుత్‌ వైర్లకు మంటలు రావడంతో బీరువా, బీరువాలో ఉన్న విలువైన సర్టిఫికెట్లు, రూ.70 వేల నగదు, మంచం మీద సామగ్రి కాలిపోయినట్లు బాధితుడు మల్లేష్‌ తెలిపారు.

వ్యక్తి కిడ్నాప్‌నకు యత్నం.. నలుగురిపై కేసు నమోదు

మోటకొండూర్‌ : బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని బెదిరించి కారులో ఎక్కించుకెళ్లిన నలుగురిపై పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. ఈ ఘటన సోమవారం మోటకొండూర్‌ మండల కేంద్రంలో జరిగింది. స్థానిక ఎస్‌ఐ అశోక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూర్‌ మండల కేంద్రానికి చెందిన షేక్‌ హజీమ్‌ తన భార్య షేక్‌ హసీనా బేగంతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు బైక్‌ను ఆపి హజీమ్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. హజీమ్‌ భార్య హసీనా బేగం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. చౌటుప్పల్‌ సమీపంలో పోలీసులు కారును పట్టుకుని హజీమ్‌ను కిడ్నాప్‌ చేసిన పీసరి నవీన్‌రెడ్డి, పీసరి మల్లారెడ్డి, తుమ్మల వెంకట్‌రెడ్డి, ముత్తినేని సందీప్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు నలుగురిపై కిడ్నాప్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు..

నకిలీ విత్తనాలు

అమ్మారంటూ రైతు నిరసన

కొండమల్లేపల్లి : తనకు నకిలీ విత్తనాలు అమ్మారంటూ ఓ రైతు మండల కేంద్రంలోని సాగర్‌ రోడ్డులో గల మన గ్రోమోర్‌ ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశాడు. చింతపల్లి మండలంలోని వెంకటంపేటకు చెందిన ఓ రైతు 10 రోజుల క్రితం కొండమల్లేపల్లిలోని మన గ్రోమోర్‌ దుకాణంలో వరి విత్తనాలు కొనుగోలు చేసి తన పొలంలో నారు చల్లాడు. ఐదు రోజులు గడిచినా మొలకెత్తకపోవడంతో రైతు ఆందోళన చెంది సోమవారం మన గ్రోమోర్‌ వద్దకు వచ్చి నిరసన తెలిపాడు. విషయం తెలుసుకున్న ఏఓ జానకి రాములు అక్కడకు వచ్చి రైతుతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం రైతుకు వరి విత్తనాల బస్తాలు తిరిగి ఇప్పించడంతో రైతు నిరసన విరమించాడు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనుగోలు చేసినపుడు రశీదు తీసుకొని భద్రపరుచుకోవాలని సూచించారు.

నల్లగొండ జీజీహెచ్‌లో

అరుదైన శస్త్ర చికిత్స

నల్లగొండ టౌన్‌ : నల్లగొండ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌)లో వైద్యులు సోమవారం అరుదైన శస్త్ర చికిత్స చేశారు. వేములపల్లి మండలం మంగాపురం గ్రామానికి చెందిన లక్ష్మి (40) కడుపునొప్పితో బాధపడుతూ ఈ నెల 5న ఆస్పత్రిలో చేరింది. వైద్యులు ఆమె కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు. సోమవారం డాక్టర్‌ స్వరూపారాణి బృందం లక్ష్మికి శ్రస్త చికిత్స చేసి కిలోన్నర కణితితో కూడిన గర్భసంచిని తొలగించారని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ గుర్రం నర్సింహారావు తెలిపారు. ప్రస్తుతం పేషంట్‌ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement