బెట్టింగ్‌కు బానిసలై పత్తి ట్రాక్టర్‌ చోరీ | - | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌కు బానిసలై పత్తి ట్రాక్టర్‌ చోరీ

Jan 13 2026 7:20 AM | Updated on Jan 13 2026 7:20 AM

బెట్టింగ్‌కు బానిసలై పత్తి ట్రాక్టర్‌ చోరీ

బెట్టింగ్‌కు బానిసలై పత్తి ట్రాక్టర్‌ చోరీ

నకిరేకల్‌ : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాడు పడి పత్తి లోడు ట్రాక్టర్‌ చోరీ చేసిన ఇద్దరు నిందితులను కేతేపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను సోమవారం నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన వీరబోయిన మహేష్‌ తాను పండించిన పత్తిని అమ్మేందుకు గాను ఈ నెల 8న అదే గ్రామానికి చెందిన జటంగి బుచ్చయ్య ట్రాక్టర్‌లో లోడు చేశాడు. మరుసటి రోజు ఉదయం మార్కెట్‌కు తీసుకెళ్లి పత్తిని అమ్ముదామనుకుని ట్రాక్టర్‌ను అదే గ్రామానికి చెందిన ప్రదీప్‌రెడ్డి ఇంటి సమీపంలో పార్కింగ్‌ చేశాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి పత్తి లోడు ట్రాక్టర్‌ కనింపించలేదు. దీంతో వీరబోయిన మహేష్‌ కేతేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

బంధువుతో కలిసి చోరీ..

అయితే కేతేపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన నూకల కోటేష్‌ ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ గేమ్స్‌ ఆడుతూ సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడుతుండేవాడు. 2019లో మాడుగులపల్లి, వేములపల్లి, కేతేపల్లి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ట్రాక్టర్‌లు చోరీ చేసి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా కోటేష్‌ మళ్లీ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్స్‌ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో తన బంధువు అయిన సూర్యాపేటకు చెందిన ఆడెపు సాయికుమార్‌తో కలిసి తిరిగి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఈ నెల 8వ తేదీ రాత్రి కేతేపల్లి మండల కేంద్రంలో వీరబోయిన మహేష్‌ పత్తి లోడు ట్రాక్టర్‌ను చోరీ చేసి సూర్యాపేటకు తరలించారు. ట్రాక్టర్‌లోని కొంత పత్తిని సూర్యాపేట శివారులోని బాలెంలోని కాటన్‌ మిల్లులో అమ్మగా రూ.72,475 నగదు వచ్చాయి. మిగిలిన పత్తిని సోమవారం కట్టంగూర్‌ మండలంలోని అయిటిపాముల వద్ద గల కాటన్‌ మిల్లుకు తీసుకెళ్తుండగా.. కేతేపల్లి మండలం ఇనుపాముల శివారులో పోలీసులు పట్టుకుని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులు కోటేష్‌, సాయికుమార్‌పై కేసు నమోదు చేసి, వారి నుంచి రూ.50వేల నగదు, ట్రాక్టర్‌ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకున్న శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, కేతేపల్లి ఎస్‌ఐ సతీష్‌ను జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ అభినందించారని డీఎస్పీ పేర్కొన్నారు.

ఇద్దరు నిందితుల అరెస్టు

ట్రాక్టర్‌, రూ.50 వేలు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement