చోరీ కేసులో ముగ్గురు రోహింగ్యాల అరెస్టు
రామగిరి(నల్లగొండ) : చోరీ కేసులో బర్మా దేశానికి చెందిన ముగ్గురు రోహింగ్యాలను ఆదివారం అర్ధరాత్రి నల్లగొండ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను నల్లగొండ అడిషనల్ ఎస్పీ జి.రమేష్ సోమవారం విలేకరులకు వెల్లడించారు. బర్మా దేశానికి చెందిన రోహింగ్యాలు హమీద్ హుస్సేన్, జహంగీర్ ఆలం, షఫిక్ ఆలం, మహ్మద్ ఇస్లాం, కమల్ హుస్సేన్, ఖైసర్, నూర్ ఖాసీం 2012లో ఇండియాకు శరణార్ధులుగా వచ్చి హైదరాబాద్‌లోని బాలాపూర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. వారంతా కలిసి పట్టణ శివారుల్లోని కంపెనీల్లో విలువైన వస్తువులు దొంగిలించి వాటిని విక్రయించగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. 2024లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చోరీ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఈ నెల 7న హైదరాబాద్ నుంచి వచ్చి నల్లగొండ పట్టణ సమీపంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న నిధి పాలిమర్ కంపెనీ గేటు తాళం పగులగొట్టి పైపుల తయారీకి వినియోగించే విలువైన వస్తువులను దొంగిలించారు. దొంగతనం చేసిన వస్తువులను కంపెనీ దగ్గరలో ఉన్న చెట్ల పొదల్లో ఉంచి బాలాపూర్ వెళ్లారు. హమీద్ హుస్సేన్, జహంగీర్ ఆలం, షఫిక్ ఆలం ఆదివారం అర్ధరాత్రి తిరిగి నల్లగొండకు వచ్చి దొంగిలించిన వస్తువులను ఆటోలో తరలిస్తుండగా.. చర్లపల్లి శివారులో టూటౌన్ సీఐ రాఘవరావు, రూరల్ ఎస్‌ఐ సైదాబాబు పట్టుకున్నారు. మిగతా నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు. పట్టుబడిన వారి నుంచి రూ.60లక్షల విలువైన 40 ఇత్తడి సైజర్‌లు, 35 అమరాన్ బ్యాటరీలు, యూపీఎస్ కేబుల్, 50 కేజీల కాపర్ వైరు, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
రూ.60లక్షల విలువైన
వస్తువులు స్వాధీనం
వివరాలు వెల్లడించిన
నల్లగొండ అడిషనల్ ఎస్పీ రమేష్


