చౌటుప్పల్‌లోనూ ‘భూ భారతి’ కుంభకోణం | - | Sakshi
Sakshi News home page

చౌటుప్పల్‌లోనూ ‘భూ భారతి’ కుంభకోణం

Jan 13 2026 7:20 AM | Updated on Jan 13 2026 7:20 AM

చౌటుప్పల్‌లోనూ ‘భూ భారతి’ కుంభకోణం

చౌటుప్పల్‌లోనూ ‘భూ భారతి’ కుంభకోణం

పోలీస్‌ కస్టడీలో నలుగురు

చౌటుప్పల్‌, యాదగిరిగుట్ట : భూ భారతి పోర్టల్‌లోని ఎడిట్‌ ఆప్షన్‌ ఆధారంగా జరిగిన చలాన్‌ల కుంభకోణంలో చౌటుప్పల్‌కు చెందిన డాక్యుమెంట్‌ రైటర్‌ పాత్ర తాజాగా వెలుగుచూసింది. జనగామలో వెలుగు చూసిన ఈ కుంభకోణంపై చేపట్టిన విచారణలో ఇక్కడి డాక్యుమెంట్‌ రైటర్‌ కూడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా ఈ కేసులో యాదగిరిగుట్ట పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో మరో ఇంటర్‌నెట్‌ నిర్వాహకుడిని ఆదివారం రాత్రి వరంగల్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

కాజేసిన సొమ్ము ఎంత?

రైతుల భూములకు రిజిస్ట్రేషన్‌ చేసేందుకు అవసరమైన స్లాట్‌ బుకింగ్‌ చేసిన సమయంలో సదరు రైతుల వద్ద లెక్కప్రకారంగా చలాన్‌కు డబ్బులు తీసుకుని ప్రభుత్వ ఖజానాకు మాత్రం మొత్తం చెల్లించకుండా చౌటుప్పల్‌కు చెందిన డాక్యుమెంట్‌ రైటర్‌ కాజేసినట్లు తెలిసింది. అయితే స్లాట్‌ బుకింగ్‌ల ద్వారా ప్రభుత్వ సొమ్ము ఎన్నిరోజులుగా కాజేశాడు, ఎన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి అనే విషయం తేలాల్సి ఉంది. జనగామలో వెలుగుచూసిన కుంభకోణం ఆధారంగా చేపట్టిన అంతర్గత విచారణలో ఇక్కడ సైతం కుంభకోణం జరిగినట్టు అధికారులు గుర్తించారు. దాంతో వారు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆ మేరకు స్థానిక ఆర్డీఓ వెల్మ శేఖర్‌రెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. అయితే డాక్యుమెంట్‌ రైటర్‌ ఒక్కడే ఇతర మండలాల డాక్యుమెంట్‌ రైటర్‌లతో జతకట్టి ఈ కుంభకోణానికి తెరలేపాడా, లేక స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో ఎవరైనా ఉద్యోగిని తనతో కలుపుకొని ఈ తతంగానికి పాల్పడ్డాడా అన్న విషయం తేలాల్సి ఉంది. విషయాన్ని అధికారులు గుట్టుగా ఉంచారు. కుంభకోణంలో ఇక్కడి డాక్యుమెంట్‌ రైటర్‌ పాత్ర వాస్తవమేనని తహసీల్దార్‌ కార్యాలయ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. ఎన్ని డాక్యుమెంట్లు, ఎంత డబ్బు అనే విషయం ఇప్పుడే చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. విచారణ జరుగుతుందని తెలిపారు.

ఫ ప్రభుత్వానికి డబ్బులు జమ చేయకుండా డాక్యుమెంట్‌ రైటర్‌ కాజేసినట్టు గుర్తింపు

ఫ వివరాలు ఆరా తీస్తున్న అధికారులు

ఫ వరంగల్‌ పోలీసుల అదుపులో యాదగిరిగుట్ట ఇంటర్‌నెట్‌ నిర్వాహకుడు

భూభారతి పోర్టల్‌ను ఆధారంగా చేసుకొని ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్‌ రుసుములను పక్కదారి పట్టించి రూ.కోట్లు కాజేసిన కేసులో పోలీస్‌ కస్టడీలో నలుగురు ఉన్నారు. ఇప్పటికే బస్వరాజుతో పాటు రాజాపేట మండలానికి చెందిన మరో ఇద్దరి ఉన్నారు. తాజాగా యాదగిరిగుట్ట పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో మరో ఇంటర్‌నెట్‌ నిర్వాహకుడిని ఆదివారం రాత్రి వరంగల్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై సంబంధిత శాఖ మంత్రి సైతం అక్రమార్కులను వదిలి పెట్టబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటికే యాదగిరిగుట్ట పట్టణంలోని అశోక భూభారతి రిజిస్ట్రేషన్‌ కార్యాలయ నిర్వాహకుడు బస్వరాజును వరంగల్‌, జనగామ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. బస్వరాజును విచారించిన సమయంలో రాజాపేట మండలానికి చెందిన ఇద్దరు ఇంటర్‌నెట్‌ నిర్వాహకులను సైతం రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. భూభారతి పోర్టల్‌ను ఆధారంగా చేసుకొని ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని కాకుండా తక్కువ రుసుమును చలాన్‌గా చెల్లించి, ఎడిట్‌ ఆప్షన్‌ ద్వారా ఇంకా ఎంత మంది పక్కదారి పట్టించారు? ఎన్ని డబ్బులు ప్రభుత్వానికి గండి పడిందనే అంశంపై పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని డాక్యుమెంట్‌, ఇంటర్‌నెట్‌ దుకాణాలపై సైతం వరంగల్‌, జనగామ పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసు కస్టడీలో ఉన్న నింధితుల విచారణలో తమతో సంబంధాలు ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలా ఉండగా సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలోని కొంత మంది డాక్యుమెంట్‌ కార్యాలయ నిర్వాహకులను కలెక్టర్‌ కార్యాలయానికి పిలిచి, డాక్యుమెంట్‌ చేసిన విధానంతో పాటు ఎన్ని డాక్యుమెంట్లు చేశారు? ఎంత నగదు ప్రభుత్వానికి చెల్లించారనే అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement