1వ తేదీ నుంచి కందుల కొనుగోళ్లు
సాక్షి,యాదాద్రి : వచ్చేనెల 1వ తేదీ నుంచి జిల్లాలో కందుల కొనుగోళ్లు ప్రారంభించాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశించారు. అదనపు కలెక్టర్ తన చాంబర్‌లో మార్క్‌ఫెడ్ డీఎంతో కలిసి సోమవారం నిర్వహించిన డీఎల్‌పీసీ సమావేశంలో కందుల కొనుగోలుపై సమీక్షించి మాట్లాడారు. జిల్లాలో దాదాపు 4,400 ఎకరాల్లో కందులు సాగుకాగా 25 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. కొనుగోలు ప్రక్రియ మొత్తం సొసైటీల ద్వారా చేపట్టాలని ఆదేశించారు. కందులకు క్వింటాకు రూ.8వేలు మద్దతు ధరగా నిర్ణయించినట్లు తెలిపారు. మద్దతు ధరకు రైతుల నుంచి కందులు కొనుగోలు చేయాలని సూచించారు. తేమ12 శాతం కంటే కూడా తక్కువ ఉండే విధంగా రైతులు జాగ్రత్త వహించి సెంటర్లకు తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి, మార్క్‌ఫెడ్ అధికారిణి జ్యోతి, డీసీఓ మురళి పాల్గొన్నారు.
త్వరలో బ్లాక్ గ్రానైట్ వేలం పాట
భువనగిరిటౌన్ : రామన్నపేట మండల కేంద్రంలోని 134 సర్వే నంబర్‌లో గల బ్లాక్ గ్రానైట్ వేలం పాటను త్వరలో నిర్వహించనున్నట్లు మైనింగ్ శాఖ సహాయ సంచాలకుడు రవి కుమార్ తెలిపారు. సోమవారం జనరల్ బ్లాక్ ఫేస్ 4 ఆక్షన్ పై కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన సమావేశం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 10 మినరల్ బ్లాక్ లకు ఆక్షన్ నోటిఫికేషన్ విడుదల చేశారని ఇందులో భాగంగా రామన్నపేటలోని సర్వే నంబర్ 134లో 5.00 హెక్టార్లలో ఉన్న బ్లాక్‌గ్రానైట్ వేలం పాట నిర్వహించనున్నామని ఆసక్తి గలవారు పాల్గొనాలని కోరారు.
ప్రజారోగ్య రక్షణే ప్రభుత్వ లక్ష్యం
భువనగిరి : ప్రజారోగ్య రక్షణే లక్ష్యంగా ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీలో రూ.1.43కోట్లతో నిర్మించిన అర్బన్ పీహెచ్‌సీ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా బీపీ చెక్ చేయించుకున్నారు. అనంతరం పచ్చలకట్ట సోమేశ్వరాలయానికి వెళ్లే మార్గంలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. కార్యక్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌మనోహార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవెజ్ చీస్తి, మున్సిపల్ కమిషనర్ రాంలింగం, వైద్యధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
బీబీనగర్‌లో..
ప్రణామ్ కార్యక్రమం వృద్ధులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్ విధానంలో వృద్ధులకు డాటా కేర్ సెంటర్ ప్రారంభించేందుకు బీబీనగర్ మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవెజ్ చీస్తి, నాయకులు పాల్గొన్నారు.


