రాజేశ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం
కోదాడ : దళిత యువకుడి కర్ల రాజేశ్‌ను పోలీసులు చిత్రహింసలకు గురిచేసి చంపారని, అతడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు. శనివారం కోదాడలోని గాంధీనగర్‌లో జరిగిన కర్ల రాజేశ్ సంతాప సభలో ఆయన మాట్లాడారు. రాజేశ్ మృతికి పోలీసులే కారణమని స్పష్టంగా తెలుస్తున్నా ఉన్నతాధికారులు కేవలం సస్పెన్షన్‌తోనే సరిపెట్టారని అన్నారు. జిల్లా ఎస్పీ ఇంత వరకు ఈ కేసు విషయంలో నోరు మెదపకపోవడం వెనుక మతలబేమిటో చెప్పాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా దళిత యువకుడి మృతిపై కనీస స్థాయిలో స్పందించలేదని అన్నారు. రాజేశ్ మృత దేహానికి పోస్ట్‌మార్టం చేసిన వైద్యుడిపై కూడా తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసును పూర్తిస్థాయిలో రీ ఇన్వెస్టిగేషన్ చేసి బాధ్యులపై హత్యాహత్నం, ఎట్రాసీటీ కేసులను నమోదు చేయాలని, చిలుకూరు ఎస్‌ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకు ముందు రాజేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు అధ్యక్షతన జరిగిన సభలో రాజేశ్ తల్లి కర్ల లలితమ్మ, జిల్లా, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
మంద కృష్ణమాదిగ


