బస్సుల్లో నిద్రించే ప్రయాణికులే టార్గెట్‌ | - | Sakshi
Sakshi News home page

బస్సుల్లో నిద్రించే ప్రయాణికులే టార్గెట్‌

Jan 11 2026 6:58 AM | Updated on Jan 11 2026 9:51 AM

బస్సు

బస్సుల్లో నిద్రించే ప్రయాణికులే టార్గెట్‌

నల్లగొండ: బస్సుల్లో నిద్రించే ప్రయాణికులనే టార్గెట్‌గా చేసుకుని బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న అంతర్‌ రాష్ట్ర ముఠా సభ్యుడిని నల్లగొండ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ధార్‌ జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి బస్సుల్లో నిద్రించే ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్నారు. డిసెంబరు 5న చిట్యాల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బస్సులో భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రెండు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ పేర్కొన్నారు. సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరానికి పాల్పడింది మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ధార్‌ జిల్లాకు చెందిన పాత నేరస్తుడిగా గుర్తించినట్లు తెలిపారు. ఈ మేరకు అక్కడికి ప్రత్యేక పోలీసు బృందాలను పంపించి వివిధ ప్రాంతాల్లో నిఘా ఉంచి మనవార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో షా అల్లా రఖా అనే వ్యక్తిని పట్టుకున్నట్లు వివరించారు. పట్టుబడిన నిందితుడు డ్రైవర్‌గా పనిచేస్తాడని, అతడి స్వస్థలం ధార్‌ జిల్లా ధర్మపురి తాలుకా ఖల్ఘాట్‌ గ్రామమని ఎస్పీ పేర్కొన్నారు. అతడిని విచారించగా.. మరో నలుగురు అఫ్రత్‌ఖాన్‌, సైఫ్‌అలీఖాన్‌, జాబర్‌ ఖాన్‌, ఉమర్‌ఖాన్‌తో కలిసి బస్సుల్లో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడని తెలిపారు. నిందితుడి నుంచి రూ.85లక్షల విలువైన చోరీకి గురైన వస్తువులు, 600 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని, మిగతా నలుగురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులు గతంలోనూ విజయవాడ హైవేపై హోటళ్ల వద్ద ఆగి ఉన్న బస్సుల్లో బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకున్న చిట్యాల సీఐ నాగరాజు, సీసీఎస్‌ ఎస్‌ఐ శివకుమార్‌, సిబ్బంది విష్ణువర్ధన్‌గిరి, పుష్పగిరి, నాగరాజు, వెంకటేష్‌, సాయికుమార్‌, జువేద్‌, శివరాజు, మహేష్‌, కమల్‌ కిషోర్‌, చిన్నబాబును ఎస్పీ అభినందించారు.

ప్రయాణికుల జేబులు

కత్తిరిస్తున్న దొంగల అరెస్ట్‌

నల్లగొండ : నల్లగొండ బస్టాండ్‌ పరిసరాల్లో తిరుగుతూ ప్రయాణికుల జేబులు కత్తిరిస్తున్న, బ్యాగులు చోరీ చేస్తున్న ఇద్దరిని టూ టౌన్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి నిందితుల వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన పసుపులేటి రేణుకతో పాటు ఆమె సహచరుడు అరవింద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. రేణుక, అరవింద్‌ 2025, జూన్‌ 30వ వారంలో రవి, ఆదినారాయణకు చెందిన కారులో నల్లగొండకు వచ్చి బస్టాండ్‌కు కొద్ది దూరంలో దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చారు. బస్టాండ్‌లో హైదరాబాద్‌కు వెళ్లే బస్‌ ఎక్కుతున్న వ్యక్తి వద్ద ఉన్న బ్యాగులోని రూ.80 వేలు చోరీ చేసి అదే కారులో పారిపోయారు. డిసెంబరు 2వ వారంలో బస్టాండ్‌కు కొద్ది దూరంలో కారు దిగి వచ్చారు. బస్టాండ్‌లో దేవరకొండ బస్‌ ఎక్కుతున్న వ్యక్తి వద్ద ఉన్న రూ.60 వేలు చోరీ చేశారు. మగవేషం వేసుకొని అమాయక ప్రయాణికులను మోసం చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఆడ దొంగపై పలువురు బాధితులు టూ టౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో క్రైమ్‌ సిబ్బంది రంగంలోకి దిగి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విచారణ చేపట్టారు. దొంగతనాలకు పాల్పడుతున్న రేణుక, అరవింద్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరం ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించి దొంగలను పట్టుకున్న టూ టౌన్‌ ఎస్‌ఐ వై.సైదులు, సిబ్బందిని ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ అభినందించినట్లు డీఎస్పీ వెల్లడించారు.

బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న

అంతర్‌ రాష్ట్ర ముఠా సభ్యుడి అరెస్టు

వివరాలు వెల్లడించిన నల్లగొండ

ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

బస్సుల్లో నిద్రించే ప్రయాణికులే టార్గెట్‌1
1/1

బస్సుల్లో నిద్రించే ప్రయాణికులే టార్గెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement