పురుగు మందుల పిచికారీలో జాగ్రత్తలు తీసుకోవాలి
త్రిపురారం : వరి, బత్తాయి, జామ, దానిమ్మ, పత్తి, కంది, మొక్కజొన్న, వివిధ రకాల కూరగాయల సాగులో చీడపీడల నివారణకు గాను పురుగు మందులను ఇష్టానుసారంగా పిచికారీ చేస్తుంటారు. అయితే కనీస జాగ్రత్తలు పాటింకపోవడంతో రైతులు అనారోగ్యం బారిన పడుతుంటారు. వాతావరణ పరిస్థితుల వలన పంటలకు కొత్త కొత్త చీడపీడలు ఆశిస్తుండడంతో మార్కెట్‌లో గాఢత ఎక్కువ ఉన్న పురుగు మందులను విక్రయిస్తున్నారు. దీంతో రైతులు మోతాదు మించి పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికా రుల సూచనల మేరకు పురుగు మందులు కొనుగోలు చేసి తగిన జాగ్రత్తలు పాటిస్తూ పిచికారీ చేసుకోవాలని త్రిపురారం మండల వ్యవసాయ అధికారి పార్వతి చౌహన్ సూచిస్తున్నారు.
● గాలికి ఎదురుగా పురుగు మందులు పిచికారీ చేయరాదు. ఇలా చేయడం వల్ల పురుగు మందు శరీరంపై పడుతుంది.
● పిచికారీ చేసే సమయంలో చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్కులు తప్పకుండా ధరించాలి.
● పిచికారీ సమయంలో మంచి నీరు తాగడం, ఆహరం తీసుకోవడం, బీడీ, సిగరెట్ వంటివి తాగొద్దు.
● శరీరం మొత్తం కప్పి ఉంచేలా ప్రత్యేక దుస్తులు ధరించాలి. కళ్లజోడు సైతం వాడాలి.
● మందులను ట్యాంకుల్లో కలుపుకునే సమయంలో చేతులకు గ్లౌజులు వేసుకోవాలి.
● పిచికారీ పూర్తయిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
● వాడిన పురుగు మందుల డబ్బాలను ఎట్టి పరిస్థితుల్లో పశుల పాకల్లో భద్రపరచరాదు.
● పురుగు మందుల వాసనతో పశువులు, మూగజీవాలు సైతం అనారోగ్యానికి గురై మృతిచెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
● ఉపయోగించిన పురుగు మందుల డబ్బాలు, ప్యాకెట్లను గుంత తీసి భూమిలో పాతి పెట్టాలి.
● మందులు పిచికారీ చేసే సమయంలో రైతులకు వాంతులు, చెమటలు అధికంగా వచ్చినా, ఆయాసం ఎక్కువైనా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
డ్రోన్‌ల వినియోగం
మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు పురుగు మందలు పిచికారీకి డ్రోన్‌లను వినియోగించుకోవడం మేలు. డ్రోన్‌ల వల్ల తక్కువ సమయంలో ఎక్కువ పంటపై మందులు పిచికారీ చేసుకోవచ్చు.
డ్రోన్‌లు ఎక్కువగా వాడాలి
త్రిపురారం మండల వ్యవసాయ అధికారి పార్వతి చౌహన్ సూచనలు
పురుగు మందుల పిచికారీలో జాగ్రత్తలు తీసుకోవాలి


