చెరువులో పడి కూలీ మృతి
మునగాల: ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి కూలీ మృతిచెందాడు. ఈ ఘటన మునగాల మండలం నేలమర్రి గ్రామ పంచాయతీ పరిఽ దిలో శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నేలమర్రి గ్రామానికి చెందిన చామకూరి రామానుజం(45) వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం గ్రామానికి చెందిన కొంతమంది వ్యవసాయ కూలీలతో కలసి పొలం పనులకు వెళ్లాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న చెరువు వద్దకు బహిర్భూమికి వెళ్లి.. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయాడు. అతడికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. అటువైపు వెళ్తున్న వ్యక్తి గమనించి మిగతా వ్యవసాయ కూలీలకు సమాచారం ఇచ్చాడు. వారు చెరువులో నుంచి రామానుజం మృతదేహాన్ని వెలికితీసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రామానుజంకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
లారీ ఢీకొని
ఆటో డ్రైవర్‌కు గాయాలు
చౌటుప్పల్ : మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామ శివారులోని పరిశ్రమ ముందు జాతీయ రహదారిపై యూటర్న్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలయ్యాయి. దివీస్ కంపెనీ ముందు యూటర్న్ తీసుకుంటున్న ఆటోను విజయవాడ వైపునకు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దాంతో ఆటో ఒక్కసారిగా పల్టీకొట్టి ముందున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ లింగోజిగూడేనికి చెందిన పోలేపల్లి అంజయ్య(56)కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అంజయ్యను చికిత్సనిమిత్తం చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆటో డైరవర్ కుమారుడు పోలేపల్లి ధన్‌రాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు.
పత్తిలోడ్ ట్రాక్టర్ చోరీ కేసులో పురోగతి
● పోలీసుల అదుపులో నిందితులు
కేతేపల్లి : కేతేపల్లిలో గురువారం రాత్రి పత్తి లోడుతో ఉన్న ట్రాక్టర్ చోరీకి గురైన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చోరీకి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. కేతేపల్లికి చెందిన జటంగి బుచ్చయ్య తన ట్రాక్టర్‌లో అదే గ్రామానికి చెందిన వీరబోయిన మహేశ్‌కు చెందిన పత్తిని లోడ్ చేసుకొని మిల్లుకు తరలించేందుకు బయల్దేరాడు. ట్రాక్టర్‌ను గురువారం రాత్రి హైవే వెంట ఉన్న ఓ ఇంటి ముందు నిలిపి ఉంచగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేతేపల్లి నుంచి సూర్యాపేట వరకు రోడ్డు వెంట ఉన్న సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. మండలంలోని భీమారం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ట్రాక్టర్ ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితులు చోరీ చేసిన పత్తిలో కొంత ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించగా మరికొంత ప్రైవేటు వ్యాపారులకు విక్రయించినట్లు తెలిసింది. పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు సూర్యాపేటలోని ఇందిరమ్మ కాలనీలో వారు వదిలేసిన ట్రాక్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు తెలిసింది. నిందితుల విచారణ అనంతరం వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.


