విద్యార్థి దశ మహోన్నతమైనది
బొమ్మలరామారం : మానవ జీవితంలో విద్యార్థి దశ మహోన్నతమైనదని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బొమ్మలరామారం మండలం రంగాపూర్ గ్రామంలోని హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీలో శనివారం నిర్వహించిన విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుతో కలసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీలో విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందిస్తున్నారని అన్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ అకాడమీ విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుకుంటున్నారని పేర్కొన్నారు. స్పష్టమైన లక్ష్యం లేకుండా చదివే విద్య వ్యర్ధమని, ప్రతి విద్యార్థి కఠోర దీక్షతో ముందుకెళ్లాలన్నారు. యువత పెడదారి పట్టకుండా మెరుగైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ.. డిఫెన్స్ అకాడమీలో ఇంటర్ విద్యతో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ లాంటి ఉన్నత ఉద్యోగాలు సాధించేందకు ప్రత్యేక కోర్సులు, శిక్షణ అందించడం అభినందనీయన్నారు. రక్షణ రంగంలో ఉన్న అపారమైన అవకాశాలను విద్యార్థులు సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులను సన్మార్గంలో నడిపేందుకు నిరంతరం శ్రమిస్తున్న అకాడమీ చైర్మన్ రాజ్‌కుమార్‌ను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు కృష్ణచైతన్యరెడ్డి, వంశీకృష్ణారెడ్డి ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ కోరే రాజ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అకాడమీ ఎండీ నవ్య, మాజీ సైనిక బ్రిగెడార్ హిలగరి, మాజీ కల్నల్ డీకే దాస్, డీన్ ఆర్కే రావు, ప్రిన్సిపాల్ అంజయ్య, విద్యావేత్త బాల్‌నర్సింహ, శ్రీశైలం పాల్గొన్నారు.
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్


