జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
మఠంపల్లి : మండలంలోని యాతవాకిళ్లకు చెందిన పులి హర్షవర్ధన్, కొత్త శివ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. వీరిద్దరు ఖమ్మంలో 2025 డిసెంబర్ 26న మోడరన్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన సెలక్షన్స్‌లో పాల్గొని సత్తా చాటడంతో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికచేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీలలో వారు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా శనివారం విద్యార్థులను నాయకులు, గ్రామస్తులు అభినందించారు.
రోడ్డు ప్రమాదంలో
గాయపడ్డ వ్యక్తి మృతి
పెన్‌పహాడ్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఏఎస్‌ఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన అంకిత్‌పాండే(24) ధూపహాడ్ గ్రామంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 4న సొంత పనుల నిమిత్తం సూర్యాపేట వెళ్లి తిరిగి వస్తుండగా అనంతారం క్రాస్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి బావమర్ది భీంపాండే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తి
మృతదేహం లభ్యం
నల్లగొండ : నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో గల అన్నపూర్ణ క్యాంటీన్ సమీపంలో శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ సతీష్ తెలిపారు. మృతుడు భిక్షగాడిలా ఉన్నాడని, వయస్సు సుమారు 55 నుంచి 60 సంవత్సరాలు ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. మృతుడి గురించిన వివరాలు తెలిసిన వారు 87126 67670, 80968 49380 నంబర్లకు సమచారం ఇవ్వాలని ఎస్‌ఐ సూచించారు.


