కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి
చిట్యాల: త్వరలో రాబోయే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై చిట్యాల మున్సిపాలిటీ ప్రజలు నిలదీయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. చిట్యాలలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులు గత రెండేళ్లుగా ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా, సమస్యలను పరిష్కరించకుండా కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నందునే ఇప్పుడు వార్డుల్లో హడావుడిగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారని ఆరోపించారు. డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసి రాజకీయాలు చేసేందుకు వస్తున్న నాయకులకు చిట్యాల పట్టణ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే చిట్యాల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకుగాను రూ.30కోట్లు కేటాయించి మౌలిక వసతులు కల్పించినట్లు వివరించారు. మరోమారు బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. మరో రెండున్నరేళ్లలో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పీటీసీ శేపూరి రవీందర్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్యగౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ మెండె సైదులు, మాజీ ఎంపీటీసీ జనగాం నర్సింహాగౌడ్, నాయకులు బొబ్బల శివశంకర్‌రెడ్డి, కందాటి రమేష్‌రెడ్డి, అఫ్సర్, చిత్రగంటి ప్రవీణ్, కన్నెబోయిన శ్రీశైలం, జిట్ట శేఖర్, అశోక్, వెంకన్న పాల్గొన్నారు.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య


