హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు : మంత్రి
చిట్యాల: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగకు వెళ్లే వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. చిట్యాల పట్టణంలో హైవేపై జరుగుతున్న ఫ్లైఓవర్ పనులను గురువారం కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, హైవే పీడీ శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిట్యాల పట్టణంలో హైవేపై జరుగుతున్న పనులను నిలిపివేసి, జాతీయ రహదారిపై తాత్కాలిక మరమ్మతులు చేసి వాహనాలు ఆగకుండా వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సూచించారు. ఎన్‌హెచ్–65ను 8 లైన్లుగా మార్చేందుకు డీపీఆర్ సిద్ధం చేశామని, మార్చిలో టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. ప్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు గ్రీన్ ఫీల్ట్ హైవే రహదారిని నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆయన వెంట డీటీసీ వాణి, చిట్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీనర్సింహ, జడల చినమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


