స్వర్ణగిరిలో ముగిసిన ఉత్తర ద్వార దర్శనం
భువనగిరి : భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30న ప్రారంభమైన ఉత్తర ద్వారం దర్శనం గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం సుప్రభాత సేవ, సహస్రనామార్చన, సుదర్శన నరసింహ హవనం, ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఆండాళ్ అమ్మవారికి పంచామృతాభిషేకం, తిరుప్పావడ సేవ, నిత్య కల్యాణోత్సవం, సాయంత్రం ఆలయ మాడ వీధుల్లో స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవ వైభవంగా నిర్వహించారు. ఆయా పూజా కార్యక్రమాల్లో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు మానేపల్లి రామారావు, మురళీకృష్ణ, గోపికృష్ణతో పాటు ప్రధాన అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.


