చికిత్స పొందుతూ మృతి
కొండమల్లేపల్లి : బురద పొలంలో దిగబడిన ట్రాక్టర్ టైర్లను సరిచేస్తుండగా కిందపడి తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండలం చెన్నంనేనిపల్లి గ్రామానికి చెందిన బాషిపాక శివ(20) ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మూడు రోజుల క్రితం ట్రాక్టర్‌పై వర్ధమానిగూడెం గ్రామానికి వెళ్తుండగా.. బురదలో ట్రాక్టర్ దిగబడింది. ఈ క్రమంలో శివ ట్రాక్టర్ టైర్లను సరిచేస్తుండగా అదుపుతప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం శివను హైదరాబాద్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ అజ్మీరా రమేష్ తెలిపారు.
అత్యాచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు
తిప్పర్తి : మహిళపై అత్యాచారం చేసిన వ్యక్తిపై తిప్పర్తి పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడకు చెందిన ఓ మహిళ తన భూమి పంచాయితీని పరిష్కరించాలని మునుగోడుకు చెందిన ఓ వ్యక్తిని కోరింది. పెద్దమనిషిగా ఉన్న ఆ వ్యక్తి భూ సమస్య పరిష్కరిస్తానని నమ్మించి బుధవారం దుప్పలపల్లి వద్ద గల ఎఫ్‌సీఐ గోదాముల వెనుకకు తీసుకెళ్లి కత్తితో బెదిరించి తనపై అత్యాచారం చేశాడని సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శంకర్ తెలిపారు.
నకిలీ సరుకులు
విక్రయిస్తున్న వ్యక్తిపై..
హుజూర్‌నగర్ : నకిలీ సరుకులు విక్రయిస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మిర్యాలగూడకు చెందిన జైయిని సత్యేందర్ హుజూర్‌నగర్ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఏరియల్, టైడ్ కంపెనీకి చెందిన నకిలీ సరుకులు అమ్ముతున్నాడని డిస్ట్రిబ్యూటర్ బచ్చు రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బుధవారం ఎస్‌ఐ బండి మోహన్‌బాబు తెలిపారు.
లారీ బీభత్సం
ఫ మద్యం మత్తులో రోడ్డు వెంట
స్తంభాలను ఢీకొట్టిన డ్రైవర్
మోత్కూరు : మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో బుధవారం లారీ బీభత్సం సృష్టించింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేషన్ బియ్యం లోడుతో వెళ్తున్న లారీని డ్రైవర్ మద్యం మత్తులో అజాగ్రత్తగా నడుపుతూ పాలడుగు గ్రామ స్టేజీ వద్ద ప్రధాన రహదారి వెంట ఉన్న బారికేడ్లు, సోలార్ లైట్ల స్తంభాలను ఢీకొట్టాడు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో బారికేడ్లు, సోలార్ లైట్ల స్తంభాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు లారీ డ్రైవర్ రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ సి. వెంకటేశ్వర్లు తెలిపారు.


