రూ.30కోట్ల నిధులున్నా..
ఆలేరు: ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని మంతపురి రోడ్డులో ఓపెన్ నాలాతో ప్రజలు అవస్థలుపడుతున్నారు. ఈ ఓపెన్ నాలా నుంచి వచ్చే దుర్వాసనతో పక్కనే ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినుల పాట్లు అన్నీఇన్నీ కావు. ఐదో వార్డులో డ్రెయినేజీ నిర్మాణం చేయకపోవడంతో ఇళ్ల మధ్య మురుగునీరు నిలుస్తోంది. గత పాలకమండలి హయాంలో నిర్మించిన భూగర్భ డ్రెయినేజీ సరిగా పని చేయడంలేదు. ఇక పాత మున్సిపల్ కార్యాలయం వరద కాల్వ నిర్మాణం శిలాఫలకానికే పరిమితమైంది. దాంతో రంగనాయకుల గుడి, కుమ్మరివాడ కాలనీలు వర్షాకాలంలో ముంపునకు గురవుతున్నాయి. హైదరాబాద్ ప్రధాన రోడ్డు , రైల్వేట్రాక్ పక్కన బృందావన్ కాలనీ మీదుగా వెళ్లే పెద్ద కాల్వ ఆక్రమణలు ముంపు సమస్యకు కారణమవుతుంది. మూడేళ్లుగా మున్సిపాలిటీ ఖజానాలో రూ.15కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులు ఉన్నా డ్రెయినేజీల నిర్మాణంపై దృష్టిపెట్టకపోవడం గమనార్హం. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి పట్టణాభివృద్ధి స్కీం కింద మరో రూ.15కోట్లను మంజూరు చేశారు. అయినా డ్రెయినేజీల నిర్మాణంపై అధికారులు దృష్టిపెట్టడంలేదు. డీపీఆర్ అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టి త్వరలో పనులు చేయడానికి కృషి చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.


