ఔట్‌లెట్ లేక అవస్థలు
భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి మున్సిపాలిటీలో మురుగునీటిని బయటికి పంపడానికి ఔట్‌లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వెంకటరమణ కాలనీ, రాంనగర్‌కాలనీ, సాయినగర్ కాలనీ, పద్మానగర్ కాలనీలకు చెందిన మురుగునీరంతా ప్రభుత్వ ఆస్పత్రి ప్రహరీ పక్కనుంచి వెళ్తోంది. కానీ ఆస్పత్రి దాటిన తరువాత పట్టా భూములు ఉండటం.. సదరు రైతులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో నీరు వెళ్లే మార్గంలేక మురుగునీరు నిలిచి మడుగును తలపిస్తోంది. బీసీ కాలనీ, మహామ్మాయి కాలనీ, ఆర్టీసీ బస్టాండ్ సమీప కాలనీలలో గతంలో అండర్ డ్రెయినేజీలు నిర్మించారు. ఆయాకాలనీల మురుగునీరు చిన్నేటిలో కలుపడానికి గతంలో రూ.1.20 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. ఈలోపు ప్రభుత్వం మారడంతో పనులు మధ్యలోనే ఆగిపోయి సమస్య మొదటికి వచ్చింది. ఈ ఐదారు కాలనీల మురుగునీరు కూడా బయటికి పోయే మార్గంలేక ఇళ్ల మధ్య చేరి దుర్వాసన, ఇటు దోమలు విస్తరించి ప్రజలు రోగాలబారిన పడుతున్నారు.


