కష్టపడి కాదు ఇష్టపడి చదవాలి
అడ్డగూడూరు: విద్యార్థులు కష్టపడికాకుండా ఇష్టపడి చదవాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. అడ్డగూడూరు మండలం కోటమర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థుల పరీక్షల సన్నద్ధతకోసం నేస్తం ఫౌండేషన్ ప్రతినిధులు పాశం అంజనేయులు, పాశం కృష్ణమూర్తి, పాశం నరసిహస్వామి ఆధ్వర్యంలో ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. దీనికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. కోటమర్తి పాఠశాలను చూస్తుంటే తాను చదువుకున్న బేతవోలు పాఠశాలతో పాటు తన బాల్యాన్ని గుర్తు చేసిందన్నారు. 10వ తరగతి జీవితంలో కీలక మలుపు అని ఇది భవిష్యత్‌కు మైలురాయిగా మారాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివినవారే జీవితంలో మంచి నాయకులుగా, ఉన్నతవిద్యావంతులుగా ఎదుగుతారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10 వ తరగతి విద్యార్థులకు రీడింగ్ చైర్స్, ప్యాడ్స్ పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో టాప్‌లో నిలిచినవారికి జూన్2న 200 సైకిళ్లను అందజేస్తాయడంతో పాటు వారి తల్లిదండ్రులను సన్మానిస్తామన్నారు. డీఈఓ సత్యనారాయణ మాట్లాడుతూ పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కృషిచేయాలన్నారు. పాఠశాల ప్రహరీ పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, గ్రామంలో శ్మశానవాటికకు సీసీ రోడ్డు మంజూరు చేయాలని కలెక్టర్‌ను సర్పంచ్ విష్ణువర్ధన్‌రావు కోరారు. స్పందించిన కలెక్టర్ ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీఇచ్చారు. ఈకార్యక్రమంలో మండల విద్యాధికారిణి సబిత, ఎంపీడీఓ శంకరయ్య, ఎంపీఓ ప్రేమలత, ఆర్‌ఐ ఉంపేదర్, కోటమర్తి పాఠశాల హెచ్‌ఎం రాజవర్ధన్‌రెడ్డి, ఎంపీపీఎస్ హెచ్‌ఎం వెంకటయ్య, చుక్క వెంకటయ్య, ఉపసర్పంచ్ కుంభం శ్రీశైలం, కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్ పద్మ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఫ టెన్త్ విద్యార్థుల ప్రేరణ కార్యక్రమంలో
కలెక్టర్ హనుమంతరావు


