వారం రోజులకు ఒకసారి
భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి మున్సిపాలిటీలో ఐదు రోజులు, ఒక్కోసారి వారం రోజుల ఒకసారి కూడా చెత్తబండి రావడంలేదు. దీంతో చెత్తను ఇళ్లలో జమ చేయలేక, బయట పడేయలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోచంపల్లిలో ముక్తాపూర్, రేవనపల్లి గ్రామాలను విలీనం చేసి మున్సిపాలిటీగా మార్చారు. మున్సిపాలిటీలో మొత్తం 6,097 గృహాలు, 21వేల పైచిలుకు జనాభా, 13 వార్డులు ఉన్నాయి. కానీ 21వేల జనాభాకు కేవలం నాలుగు చెత్తసేకరణ ఆటోలు, రెండు ట్రాక్టర్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో రెండు ఆటోలు చెడిపోగా, ఇటీవల ఒకటి రిపేరు చేయించారు. మున్సిపాలిటీ ప్రతిరోజు 6 టన్నుల చెత్త వస్తోంది. కానీ సరిపోను ఆటోలు, పారిశుద్ధ్య సిబ్బంది లేరు. సెగ్రిగేషన్ షెడ్(డీఆర్‌సీ) లేక చెత్తను కాలుస్తున్నారు. మోడల్‌స్కూల్ సమీపంలో ఏర్పాటుచేసిన చెత్తడంపింగ్ యార్డులో చెత్తను కాలుస్తుండటంతో పొగ, దుర్వాసనతో విద్యార్థులు అనారోగ్యంబారిన పడుతున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో 36 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. జనాభా ప్రతిపాదికన మరో 20 మంది కార్మికులు, మరో నాలుగు చెత్త సేకరణ ఆటోలు అవసరం.


