ఇష్టారాజ్యంగా చెత్త వేస్తున్న జనం
చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణకు మున్సిపాలిటీ నుంచి 10ఆటోలు, 02ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. చెత్త సేకరణ, ఆటోలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ప్రతి రెండు వార్డులకు ఒక ఆటో చొప్పున కేటాయించారు. ఒక్కో వార్డులో రోజువిడిచి రోజు చెత్తను సేకరిస్తున్నాయి.ప్రైవేట్ నిర్వాహకులు ఒక్కో కుటుంబం నుంచి రూ. 100 చొప్పున వసూలు చేస్తున్నారు. రోజూ సుమారు 12–14 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఈ చెత్తను పట్టణ శివారులో ఉన్న గోల్డెన్ ఫారెస్ట్ భూమిలో పోస్తున్నారు. ఇటీవల తీసుకువచ్చిన రెమిడియేషన్ యంత్రం ద్వారా చెత్తలోని ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, సీసాలు, ఇనుము, మెత్తటి మట్టి, దుస్తులు, ఇతర వస్తుల చొప్పున వేరు చేస్తున్నారు. చెత్తసేకరణకు సరిపడా సిబ్బంది ఉన్నారు. ఇంటి ముందుకు వాహనాలు వస్తున్నా కొందరు చెత్త వేయడంలేదు. తమ ఇంట్లోని చెత్తను ప్లాస్టిక్ కవర్లలో నింపి ఊరు చివరన పడేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం పూర్తిగా దుర్గంధంగా మారుతోంది.


