కూల్చి రెండేళ్లు.. పూర్తికి ఎనే్నళ్లో
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా యాదగిరిగుట్ట పట్టణంలో ఉన్న యోగానంద నిలయాన్ని రెండేళ్ల క్రితం కూల్చారు. దాని స్థానంలో కొత్త భవనం నిర్మించాల్సి ఉండగా.. నేటికీ పనులు ప్రారంభించలేదు. యోగానంద నిలయం ఉన్నప్పుడు సామాన్య భక్తులు బస చేయడానికి ఎంతో సౌకర్యంగా ఉండేది. దేవస్థానం అధికారులు వెంటనే స్పందించి నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని భక్తులు కోరుతున్నారు.
శిథిలావస్థకు చేరిందని..
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి సన్నిధికి వచ్చే భక్తులు బస చేయడానికి 1986 జనవరి 22న యాదగిరిగుట్ట పట్టణంలో యోగానంద నిలయాన్ని ప్రారంభించారు. ఈ భవనంలో 58 గదులు, 7 పెద్ద హాళ్లు ఉండేవి. ప్రారంభించినప్పటి నుంచి 2019 వరకు యోగానంద నిలయంలో నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో బస చేసేవారు. 2019లో కరోనా విజృంభించడంతో నిలయాన్ని మూసివేశారు. తిరిగి మూడేళ్ల పాటు తెరవకపోవడంతో అందులోని ఫర్నిచర్, విద్యుత్ సామగ్రి తదితర వస్తువులన్నీ అపహరణకు గురయ్యాయి. భవనం కూడా శిథిలావస్థకు చేరడంతో భక్తుల విజ్ఞప్తి మేరకు దేవస్థానం అధికారులు నూతన భవన నిర్మాణానికి సంకల్పించారు. నిలయం ముందు భాగంలోని దుకాణాలను ఉంచి, వెనుకభాగంలో ఉన్న గదులను పూర్తిగా తొలగించారు.
2023 సెప్టెంబర్‌లో కూల్చివేత
దుకాణాలు మినహా మిగతా భవనాన్ని 2023 సెప్టెంబర్‌లో పూర్తిగా తొలగించారు. నూతన భవన నిర్మాణం కోసం అప్పట్లోనే టెండర్లు పిలిచేందుకు అధికారులు హడావుడి చేశారు.అప్పటి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ, ప్రక్రియ ముందుకు సాగలేదు. భవనం కూల్చివేసిన ప్రాంతమంతా ప్రస్తుతం పిచ్చిమొక్కలు, కంపచెట్లు, చెత్తాచెదారంతో నిండిపోయింది.
యాదగిరిగుట్టలో యోగానంద నిలయం కూల్చివేత
నేటికీ మొదలుకాని పనులు
సామాన్య భక్తుల బసకు ఇక్కట్లు


