6 మున్సిపాలిటీల్ల్లో 121 అభ్యంతరాలు
భువనగిరిటౌన్ : మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓటరు జాబితా అభ్యంతరాల స్వీకరణ గడువు ఆదివారం సాయంత్రంతో ముగిసింది. ఈనెల 1న డ్రాఫ్ట్ లిస్ట్ ప్రకటించిన అధికారులు.. వాటిని ఆర్డీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. ఈటిపై ఓటర్ల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. ఒకే కుటుంబంలోని ఓట్లు వేర్వేరు వార్డుల్లో నమోదు కావడం, ఇల్లు ఒక వార్డులో ఉంటే.. ఓట్లు మరో వార్డు పరిధిలోకి రావడం, ఇల్లు విక్రయించి మరో చోటకు తరలివెళ్లినా అదే ఇంటిలో పేర్లు ఉండటం వంటి కారణాలపై అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. వీటితో పాటు డోర్ నంబర్ల నమోదులో తప్పిదాలు చోటు చేసుకున్నాయి. అభ్యంతరాల స్వీకరణకు 2నుంచి 4వ తేదీ వరకు గడువు ఉండగా.. జిల్లా వ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీల్లో 121 దరఖాస్తులు అందాయి. అత్యధికంగా భువనగిరి, యాదగిరిగుట్టలో అభ్యంతరాలు అందినట్లు అధికారులు తెలిపారు.
మున్సిపాలిటీల వారీగా
వచ్చిన అభ్యంతరాలు
అత్యధికంగా భువనగిరి మున్సిపాలిటీలో 45, యాదగిరిగుట్టలో 44 దరఖాస్తులు వచ్చాయి. చౌటుప్పల్ 12, మోత్కూర్ 2, భూదాన్‌పోచంపల్లి 16, ఆలేరులో 2 చొప్పున అభ్యంతరాలు అందాయి.
10న తుది జాబితా..
అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసినందున రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారులు సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. 5న మున్సిపాలిటీ, 6న కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి అందిన అభ్యంతరాలపై చర్చించనున్నారు. సవరణలు ఉంటే సరిచేసి ఈనెల 10న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నారు.
ముగిసిన అభ్యంతరాల
స్వీకరణ గడువు
నేడు,రేపు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
పొరపాట్లకు తావుండొద్దు
ఓటరు జాబితాలో పొరపాట్లకు తావుండరాదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ఆదేశించారు. ఆదివారం ఆయన భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలను సందర్శించారు. డ్రాఫ్ట్ లిస్ట్‌పై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించారు. మార్పులు, చేర్పులు ఉంటే పరిష్కరించి 10వ తేదీన తుది జాబితా విడుదల చేయాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఈ ప్రక్రియ ఎంతో కీలకమని, పారదర్శకంగా జాబితా రూపొందించాలని స్పష్టం చేశారు.


