సంస్థ ప్రగతికి దీక్షతో పని చేయండి
యాదగిరిగుట్ట: విద్యుత్ సంస్థ ప్రగతికి సంస్థలోని ప్రతి ఉద్యోగి కర్తవ్య దీక్షతో పని చేసి వినియోగదారుల మన్ననలు పొందాలని తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.బి.సి.రెడ్డి పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర పవర్ డిప్లొ మా ఇంజనీర్ల సంఘం నూతన డైరీని ఆ సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్వ ఏపీఎస్‌ఈబీ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు)ని నాలుగు కంపెనీలుగా విడగొట్టిన తర్వాత విద్యుత్ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా సంస్థ పురోభివృద్ధికి ఇంజనీర్లు వ్యూహాలు రచించి, ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే మూడో డిస్కం విధివిధానాలపై చర్చించడంతో పాటు, దాని మనుగడకు యాజమాన్యాలు ఏకపక్షంగా వ్యవహరించకుండా ఉద్యోగులను కూడా భాగస్వాములను చేసి సూచనలు స్వీకరించాలన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1నుంచి అమలుపర్చబోమే పీఆర్సీ ఆమోదయోగ్యంగా ఉండేలా అన్ని సంఘాల జేఏసీలు ఏకతాటిపైకి వచ్చి కృషి చేయాలని కోరారు. ప్రైవేట్ విద్యుత్ తక్కువ ధరకు లభిస్తుందన్న సాకుతో జెన్కో థర్మల్ ప్లాంట్లు ఉత్పత్తి తగ్గిస్తున్నాయన్నారు, వాటిని పూర్తిస్థాయిలో నడిపించి ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఉద్యోగుల బదిలీలు ప్రస్తుతం నిలిపివేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని, సానుకూలంగా ఫలితం వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ జనరల్ తాజుద్దీన్ బాబా, నాయకులు ఇంద్రసేన, రాజా, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, నరేందర్, ప్రతాప్‌రెడ్డి, సీతారామరెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
డిప్లొమా ఇంజనీర్ల సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు పి.బి.సి.రెడ్డి


