నేడు వైకుంఠ ద్వార దర్శనం
యాదగిరిగుట్ట : వైకుంఠ ఏకాదశి వేడుకకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముస్తాబైంది. మంగళవారం ఆలయ ఉత్తర మహా రాజగోపురం ద్వారం నుంచి వైకుంఠనాథుడి అలంకరణలో యాదగిరీశుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాధికారులు తాత్కాలికంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా లడ్డు, పులిహోర ప్రసాదాన్ని తయారు చేయించినట్లు ఈఓ వెంకట్రావ్ ఇప్పటికే వెల్లడించారు. కొండపైకి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా, వీఐపీలు వచ్చే ప్రాంతాల్లో, ఆలయ పరిసరాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్తర మాడ వీధిలో ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో సుమారు 5వేలకు పైగా భక్తులు కూర్చునే విధంగా కుర్చీలు సిద్ధం చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అలంకరించారు. సోమవారం భువనగిరి డీసీపీ ఆక్షాంక్‌యాదవ్ కొండ పైన మాడ వీధులు, ఆలయ పరిసరాలను పరిశీలించి భద్రతా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఏసీపీ శ్రీనివాస్‌నాయుడు, పట్టణ సీఐ భాస్కర్, ఎస్‌పీఎఫ్ ఆర్‌ఐ శేషగిరిరావు తదితరులున్నారు.
వేకువజాము 2 గంటల నుంచే..
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని యాదగిరీశుడి ఆలయాన్ని మంగళవారం వేకువజామున 2గంటలకే తెరిచి సుప్రభాతం, ప్రాతఃకాల తిరువారాధన, తిరుప్పావై సేవాకాలం, బాలభోగం, ఆరగింపు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారి అలంకారం, ఉదయం 5.30 నుంచి 6.30గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం, మంగళ వాయిద్యం, చతుర్వేద పారాయణం, వైకుంఠ ఏకాదశి విశిష్టత ఉపన్యాసం జరిపిస్తారు. ఆ తర్వాత తిరువీధి సేవ, అధ్యయనోత్సవ పురవీధి సేవ, 8.00 నుంచి 10.30గంటల వరకు సర్వ దర్శనాలు, 10.30 నుంచి 11.30గంటల వరకు బ్రేక్ దర్శనాలు, 11.30 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సర్వ దర్శనాలు ఉంటాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు స్వామి వారి అధ్యయనోత్సవ తిరుమంజన స్నపనం, మధ్యాహ్నం 12.30 నుంచి 1.30గంటల వరకు స్వామి వారికి మధ్యాహ్నా రాజభోగం, 1.30గంటల నుంచి యథావిధిగా నిత్య కై ంకర్యాలు ఉంటాయి.
పాతగుట్ట ఆలయంలో..
పాతగుట్ట ఆలయాన్ని వేకువజామున 4గంటలకు తెరిచి సుప్రభాతం, ప్రాతఃకాల తిరువారాధన, సేవా కాలం, ఆరగింపు, తీర్థ ప్రసాద గోష్ఠి, స్వామి వారి ముక్కోటి గరుఢ వాహన సేవ అలంకారం చేస్తారు. అనంతరం ఉదయం 6.45 నుంచి 7.30 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం, ఆ తర్వాత పురవీధి సేవ, స్వామి వారి అలంకార సేవ దర్శనం, చతుర్వేద పారాయణం, నిజాభిషేకం చేస్తారు. ఉదయం 8.30గంటల నుంచి యథావిధిగా నిత్య కై ంకర్యాలు జరిపిస్తారు.
రెండు రోజులు ఉత్తర ద్వార దర్శనం..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైధిక కమిటీ నిర్ణయం మేరకు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం, బుధవారం రెండు రోజుల పాటు ఉభయ దర్శన సమయ వేళల్లో భక్తులకు ఉత్తర ద్వారం నుంచి స్వామి వారి దర్శన భాగ్యం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
గవర్నర్‌కు ఆహ్వానం
వైకుంఠ ఏకాదశి వేడుకకు హాజరు కావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సోమవారం ఆలయ ఈఓ వెంకట్రావ్, అర్చకులు కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గవర్నర్‌కు వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ వెంకట్రావ్ లడ్డూ ప్రసాదం అందజేశారు.
నేడు వైకుంఠ ద్వార దర్శనం
నేడు వైకుంఠ ద్వార దర్శనం


