పొలంలో పడి యువ రైతు మృతి
రామన్నపేట : పొలం పనులకు వెళ్లిన యువ రైతు బురద పొలంలో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామంలో జరిగింది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శోభనాద్రిపురం గ్రామానికి చెందిన బొడిగె నరేష్(35) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రోజు మాదిరిగానే ఆదివారం పొలం పనులకు వెళ్లిన నరేష్ సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ కూడా స్విచ్చాఫ్ రావడంతో అతడి భార్య మాధవి కుటుంబ సభ్యులతో కలిసి పొలం వద్దకు వెళ్లి చూడగా.. పొలంలోని బురదలో కూరుకుపోయి విగతజీవిగా కనిపించాడు. అయితే తన భర్త మృతిపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని మృతుడి భార్య సోమవారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
చికిత్స పొందుతూ..
మునగాల: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. వివరాలు.. మునగాల మండలం తాడువాయి గ్రామానికి చెందిన జిల్లేపల్లి గోపి(25) నెల రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై తన స్నేహితుడితో కలిసి మిర్యాలగూడకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. మిర్యాలగూడ–నేరేడుచర్ల మధ్య అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతిచెందాడు. మృతుడు అవివాహితుడు.
విద్యుదాఘాతంతో
వ్యక్తి మృతి
● మరో నలుగురికి గాయాలు
మోటకొండూర్ : 11 కేవీ విద్యుత్ లైన్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మోటకొండూర్ మండలంలో సోమవారం జరిగింది. ఎస్‌ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూర్ మండలం ఇక్కుర్తి గ్రామ శివారులో ఇటీవల రైస్ మిల్లు ప్రారంభించారు. కాగా మోటకొండూర్ సబ్‌స్టేషన్ నుంచి రైస్ మిల్లుకు 11 కేవీ విద్యుత్ వైర్ల పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం దిలావర్‌పూర్ శివారులోని సన్ సిటీ వెంచర్ వద్ద కార్మికులు విద్యుత్ లైన్ పనులు చేస్తుండగా పైన ఉన్న కరెంట్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పోలంకి సీతారాం(45) అక్కడికక్కడే మృతిచెందాడు. హైదరాబాద్‌కు చెందిన మున్నా అన్సారీ, బజరంగీ, సర్వయ్య, ముక్లియా మోసిస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆలేరు ఆస్పత్రి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ అశోక్ తెలిపారు.
పొలంలో పడి యువ రైతు మృతి


