జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం
చిట్యాల : చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి సుమారుగా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. చిట్యాల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న పాల ట్యాంకర్ గుండ్రాంపల్లి గ్రామ శివారులో డివైడర్‌ను ఢీకొని అదుపుతప్పి జాతీయ రహదారిపై అడ్డంగా బోల్తా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. హైవే గుత్తేదారు క్రేన్ సహాయంతో పడిపోయిన పాల ట్యాంకర్‌ను రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
వరిలో ఎరువుల వాడకం తగ్గించడమే లక్ష్యం
కట్టంగూర్ : వరి సాగులో పెట్టుబడులు, ఎరువుల వాడకం తగ్గించటమే కార్బన్ మింట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లక్ష్యమని ఆ సంస్థ డైరెక్టర్ పిండిపోలు వెంకట్ అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్బన్ మింట్ సంస్థ ఆధ్వర్యంలో రైస్ 360తో వాతావరణ మార్పును తగ్గించేందుకు, వరి సాగులో మెరుగైన నీటి పారుదల, యాంత్రీకరణ అనే కార్బన్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా కింద వరి సాగు చేసే రైతులను ప్రోత్సహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అయిటిపాముల గ్రామంలో ఎఫ్‌పీఓ ద్వారా 450 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును గోల్డ్ స్టాండర్డ్ కింద నమోదు చేయాలని ప్రతిపాదించబడిందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా తడి, పొడి సాగు పద్ధతి, శాసీ్త్రయమైన యాంత్రీకరణ విధానాలు, మీథేన్ ఉద్గారాల తగ్గింపు, నీటి వినియోగంలో సమర్థత, రైతుల ఆదాయ అభివృద్ధి లక్ష్యంగా వాతావరణానికి అనుకూలమైన క్‌లైమెట్ స్మార్ట్ వరి సాగును ప్రోత్సహించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఏపీలోని గుంటూరు జిల్లా చెరువు జమలపాలెం గ్రామంలో ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు వివరించారు. కార్బన్ మింట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో 2026 జనవరి 30న అయిటిపాముల గ్రామంలో నిర్వహించే సమావేశానికి స్థానిక ప్రజలు, సంబంధిత వాటాదారులు, ఆసక్తి గల రైతులు అధిక సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని కోరారు.


