గుట్ట అభివృద్ధికి ప్రత్యేక ఫండ్ అవసరం
యాదగిరిగుట్ట: పంచ నారసింహుడు కొలువైన యాదగిరిగుట్ట పట్టణం.. తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్నా అభివృద్ధిలో మాత్రం వెనుకబడిందని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గోద శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కళ్లెం కృష్ణ తదితరులు పేర్కొన్నారు. పట్టణం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక ఫండ్ అవసరమని, ఇందుకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. సోమవారం పార్టీ నాయకులతో కలిసి ఽమున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారని, అందుకు అనుగుణంగా డ్రెయినేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పట్టణ పరిధిలో చాలా మంది పేదలు అద్దె ఇళ్లలో ఉంటున్నారని, వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. అనంతరం 180 సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్ కమిషనర్ లింగస్వామికి అందజేశారు. ధర్నాలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పేరబోయిన మహేందర్, మున్సిపల్ శాఖ కార్యదర్శి బబ్బురి శ్రీధర్, మండల కార్యదర్శి కల్లేపల్లి మహేందర్, మున్సిపల్ మాజీ కో–ఆప్షన్ సభ్యుడు పేరబోయిన పెంటయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోరేటి రాములు, మున్సిపల్ సహాయ కార్యదర్శి పేరబోయిన బంగారు, కార్యవర్గ సభ్యులు ఆరె పుష్ప, గోపగాని రాజు, రాయగిరి బాలకిషన్, మూనుకుంట్ల నరసమ్మ, గుండు వెంకటేష్, ముక్కెర్ల పెంటయ్య పాకలపాటి రాజు, మద్దూరు భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.


