
భూసేకరణే ప్రధాన సమస్య!
మూసీ కాలువల ఆధునీకరణకు అడ్డంకి ఇదే..
సాక్షి,యాదాద్రి: మూసీ కాలువల ఆధునీకరణకు భూ సేకరణ ప్రధాన సమస్యగా మారింది. భూ ముల ధరలు బహిరంగ మార్కెట్‌లో భారీగా పలుకుతున్నందున అదే స్థాయిలో పరిహారం ఇ వ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అడ్డంకులు తొలగించి ఆధునీకరణ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులను ఒప్పించే ప్రయ త్నం చేస్తున్నారు.
నేటినుంచి రైతులతో సమావేశాలు .. ఉమ్మడి జిల్లాకు లబ్ధి చేకూరేలా బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల విస్తరణకు అవసరమైన భూ సేకరణ చేయటానికి రెవెన్యూ యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. అయితే భూములు సేకరించాల్సిన బాధ్యతను ప్రభుత్వం ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌పై మోపింది. దీంతో వారు రైతులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి పరిహారంపై చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం వలిగొండ మండల రైతులతో అధికారులు సమావేశం కానున్నారు.
66 కి.మీ పొడవు పిలాయిపల్లి కాలువ
రంగారెడ్డి జిల్లా బండరావిర్యాల నుంచి భువనగిరి జిల్లా మీదుగా నల్లగొండ జిల్లా ఉరుమడ్ల గ్రామం వరకు 66 కిలో మీటర్ల పొడవు పిలాయిపల్లి కాలువను ఆధునీకరించనున్నారు. బండరావిర్యాల నుంచి భూదాన్‌పోచంపల్లి మండలం మైసమ్మ కత్వవరకు ఏడు మీటర్లు, అక్కడినుంచి చిన్నకోడూరు వరకు ఆరు మీటర్లు, అక్కడి నుంచి ఉరుమడ్ల వరకు 5 మీటర్లు కాలువను వెడల్పు చేయనున్నారు.భూ సేకరణకు రూ.86.22 కోట్లు అవసరం కాగా.. ప్రస్తుతం రూ.8 కోట్లు సిద్ధంగా ఉన్నాయి.
ధర్మారెడ్డి కాలువ..
ధర్మారెడ్డిపల్లి నుంచి నార్కట్‌పల్లి మండలం లింగోటం వరకు 66 కిలో మీటర్ల మేర ధర్మారెడ్డి కాలువను ఆధునీకరించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.123.98 కోట్లు మంజూరు చేసింది. కాలువ విస్తరణకు అవసరమైన భూసేకరణ మొదలైంది. అయితే పలు ప్రాంతాల్లో రైతులు భూములిచ్చేందుకు అంగీకరించడం లేదు.ప్రభుత్వం ఇస్తానంటున్న పరిహారం సరిపోదని, పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
బునాదిగాని కాలువకు 350 ఎకరాలు అవసరం
బీబీనగర్ మండలం మక్తా అనంతారం నుంచి మోత్కూరు మండలం ధర్మారం వరకు 98.64 కిలో మీటర్ల మేర బునాదిగాని కాలువను ఆధునీకరించనున్నారు. ప్రారంభంలో 6 మీటర్లు, ఆ తరువాత 5, 4 మీటర్ల మేర కాలువను వెడల్పు చేయనున్నారు. భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలోని 32 గ్రామాల్లో సుమారు 350 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. కాలువ ఆధునీకరణకు ప్రభుత్వం ఇప్పటికే ఇప్పటికే రూ.269 కోట్లు మంజూరు చేసింది. భూ సేకరణకు సంబంధించి ప్రస్తుతం రూ.10 కోట్లు సిద్ధంగా ఉన్నాయి. అయితే బహిరంగ మార్కెట్ రేట్ ఎక్కువగా ఉన్నందున పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే కారణంతో మక్తా అనంతారం వద్ద బునాదిగాని కాలువ పనులను రైతులు అడ్డుకున్నారు.
పరిహారం పెంచాలంటున్న రైతులు
భూములు ఇవ్వడానికి విముఖత, పనుల అడ్డగింత
ఆటంకాలను తొలగించేందుకు కార్యాచరణ
క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పర్యటన
రైతులను ఒప్పించి కాలువల పనులు ముందుకు తీసుకెళ్లేయత్నం
వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తాం
మూసీ కాలువల ఆధునీకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పటికే బీబీనగర్ మండలం మక్తాఅనంతారం నుంచి బునాదిగాని కాలువ పనులు ప్రారంభించాం. కొన్ని చోట్ల రైతులు పరి హారం పెంచాలని అడుగుతున్నారు. ప్రభుత్వంతో చర్చించి ఎక్కువ పరిహారం ఇప్పేంచే ప్రయత్నం చేస్తాం. – అనిల్‌కుమార్‌రెడ్డి,
భువనగిరి ఎమ్మెల్యే

భూసేకరణే ప్రధాన సమస్య!