
కొత్త విధానం.. కష్టాలు అదనం
భువనగిరిటౌన్ : చేయూత పింఛన్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఫేస్ రికగ్నేషన్ విధానం ద్వారా కొత్త చిక్కులు తలెత్తుతున్నాయి. ఒక్కో లబ్ధిదారు ఫొటోను మిత్ర యాప్‌లో అప్‌లోడ్ చేయడానికి 15 నిమిషాలకు పైగా సమయం తీసుకుంటుంది. ఒక్కోసారి సైట్ ఓపెన్ కాకపోవడం, నెట్ సిగ్నల్స్ అందకపోవడం, లబ్ధిదారుల ఆధార్ వివరాలు అప్‌డేట్ కాకపోవడం వంటి సమస్యల కారణంగా పింఛన్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. అంతేకాకుండా పోస్టల్ సిబ్బందికి ప్రభుత్వం ట్యాబ్‌లు పంపిణీ చేయకపోవడంతో సెల్‌ఫోన్‌లలో మిత్ర యాప్ డౌన్‌లోడ్ చేసుకొని లబ్ధిదారుల పొటోలు అప్‌లోడ్ చేస్తున్నారు. సెల్‌ఫోన్లు సరిగా పనిచేయకపోవడం కూడా సమస్యకు కారణమవుతోంది. గురువారం భువనగిరి, ఆలేరు, బొమ్మలరామారం మండలాల్లోని పోస్టల్ కార్యాలయాల్లో ఇటువంటి సమస్యలే ఎదురయ్యాయి. దీంతో లబ్ధిదారులు పొద్దస్తమానం పడిగాపులు కాయక తప్పలేదు. చాలా మంది లబ్ధిదారులు వెనుదిరిగి వెళ్లారు. మరోవైపు తాగునీరు, నీడ సౌకర్యం కూడా లేకపోవడంతో వృద్ధులు అవస్థలు పడ్డారు.
‘ఫేస్ రికగ్నేషన్’తో సాంకేతిక సమస్యలు
మిత్ర యాప్‌లో అప్‌లోడ్ కాని ఫొటోలు
సైట్ సమస్య అంటున్న పోస్టల్ సిబ్బంది
మూడు రోజులుగా తిరుగుతున్న
పింఛన్ కోసం మూడు రోజుల నుంచి పోస్టాఫీస్‌కు వచ్చిపోతున్న. సైట్ ఓపెన్ కావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. పాత విధానమే బాగుంది. – తాళ్ల పద్మ, జలాల్‌పూర్

కొత్త విధానం.. కష్టాలు అదనం