
ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచండి
బొమ్మలరామారం,బీబీనగర్, తుర్కపల్లి: ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణాలను నిరంతరం పర్యవేక్షిస్తూ పనుల్లో వేగం పెంచాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ అధికారులను ఆదేశించారు.బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపలి, మేడిపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గురువారం ఆయన పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్దేశిత స్థలంలోనే ఇళ్లు నిర్మించుకోవాలని, విస్తీర్ణం పెరిగితే అదనపు ఖర్చుతో భారంగా మారుతుందని లబ్ధిదారులకు సూచించారు. ప్రభుత్వ నిబంధనల గురించి లబ్ధిదారులకు అవగాహన కల్పించడంతో హౌసింగ్ అధికారులు అలసత్వం వహిస్తున్నారని మందలించారు. ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ లబ్ధిదారులకు సహకరించాలని స్పష్టం చేశారు. నాగినేనిపల్లిలో చిక్క సరోజన, గొట్టిముక్కుల రాజమ్మకు మంజూరైన ఇళ్ల నిర్మాణానికి చేయూతనిచ్చిన నాయకుడు రామిడి జంగారెడ్డిని ఎండీ గౌతమ్ అభినందించారు. అదే విధంగా బీబీనగర్ కొండమడుగు గ్రామం, తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణ వ్యయంపై లబ్ధిదారులకు సరైన అవగాహన కల్పించలేదని కొండమడుగు గ్రామంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం చేయకుండా లబ్ధిదారులకు ఇసుక, ఇతర మెటీరియల్ సమకూర్చాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ కృష్ణారెడ్డి, జిల్లా హౌ సింగ్ పీడీ విజయ్‌సింగ్, మండల నోడల్ అధికారి జ్యోతికుమార్, ఎంపీడీఓ రాజా త్రివిక్రమ్, డీఈ శ్రీరాములు, ఏఈ రోహిత్, పంచాయతీ కార్యదర్శులు నవీన్, గణేష్ తదితరులు ఉన్నారు.
హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్