
టీచర్లకు పదోన్నతులు!
భువనగిరి: ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కనున్నాయి. పదోన్నతులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలుపడం.. అందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించిన నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. తొమ్మిదేళ్ల తర్వాత పదోన్నతులు, ఆరేళ్ల తర్వాత బదిలీలను గత సంవత్సరం నిర్వహించారు. ఆ తరువాత ఏర్పడిన ఖాళీలను పదోన్నతుల ద్వారా ప్రస్తుతం భర్తీ చేయనున్నారు. పదోన్నతులకు ముందే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా అనివార్య కారణాలతో ఆలస్యమైంది. జూలై మాసం పూర్తి కావస్తున్నందున తొలుత పదోన్నతుల ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జాబితా రూపకల్పనలో అధికారులు నిమగ్నం అయ్యారు. పదోన్నతులకు సంబంధించి నేడో, రేపో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది.
2,939 మంది ఉపాధ్యాయులు
జిల్లాలో 715 పాఠశాలలు ఉన్నాయి.వీటిలో 484 ప్రాథమిక, 68, ప్రాథమికోన్నత, 163 జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పా ఠశాలల్లో 2,939 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 1,105 ఎస్జీటీ, 1640 మంది స్కూల్ అసిస్టెంట్లు(ఎస్‌ఏ), 136 గజిటెడ్ హెచ్‌ఎంలు(జీహెచ్‌ఎం), మిగిలిన ఉపాధ్యాయులు ఇతర కేటగిరీలకు చెందిన వారున్నారు. గత ఏడాది నిర్వహించి పదోన్నతులు, బదిలీల్లో సుమారు 460 మందికి పదోన్నతులు దక్కగా, 1,324 మంది ఉపాధ్యాయులకు బదిలీల అయ్యారు.
మల్టీజోన్–2 పరిధిలో జీహెచ్‌ఎంలకు,
జిల్లా పరిధిలో ఎస్‌జీటీలకు పదోన్నతులు
మల్టీజోన్–2 పరిధిలో గెజిటెడ్ (జీహెచ్‌ఎం) ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు దక్కనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో జీహెచ్‌ఎంల ఖాళీలు 30 ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే సీనియార్టీ జాబితా సైతం రూపొందించారు. ఇక ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా ప్రస్తుతం 80 (ఎస్‌జీటీలు) మంది విధులు నిర్వహిస్తుండగా మరో 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్జీటీలో 150 నుంచి 170 వరకు ఉపాధ్యాయులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. మొత్తంగా 200 మందికి పదోన్నతులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత జూన్ 30వ తేదీ వరకు ఏర్పడిన ఖాళీల అధారంగా పదోన్నతులు కల్పించే అవకాశం ఉంది.
బదిలీతో కూడిన పదోన్నతులు కల్పించాలి
ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అయితే పదోన్నతుల కోసం జూలై 31 కటాఫ్ తేదీగా తీసుకుంటే బాగుంటుంది. అలాగే బదిలీతో కూడిన పదోన్నతులు కల్పించాలి. మూడో కేటగిరీలోని ఎస్‌జీటీలు, పీఈటీలు, భాషా పండితుల అర్హతలను బట్టి పదోన్నతులివ్వాలి.
–మైలారం సత్తయ్య,
డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
విద్యారంగ సమస్యలపై యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నాం. ఇప్పటికే పలుమార్లు ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు కల్పించాలని ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశాం. ఇంతలోనే ఉపాధ్యాయుల పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం సంతోషకరమైన విషయం. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
–మెతుకు సైదులు,
యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
ప్రభుత్వ ఆదేశాలతో కసరత్తు చేస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారులు
ఫ జాబితా తయారీలో నిమగ్నం
ఫ జిల్లాలో 200 మందికి ప్రయోజనం చేకూరే అవకాశం
ఫ స్కూల్ అసిస్టెంట్‌లుగా ఎస్‌జీటీలు
ఫ నేడో, రేపో షెడ్యూల్
పాఠశాలలు 715
ఉపాధ్యాయులు 2,939
ఎస్‌జీటీలు 1,105
ఎస్‌ఏలు 1,640
జీహెచ్‌ఎంలు 136
ఇతరులు 58
సర్దుబాటుపై సందిగ్ధం?
2025–26 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు జూన్ 12కు ముందే తాత్కాలిక సర్దుబాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇదే సమయంలో బడిబాట కార్యక్రమం ఉండటం, విద్యార్థుల సంఖ్యపై స్పష్టత రాకపోవడంతో వాయిదా వేసింది. సర్దుబాటు ప్రక్రియ ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ 22వ తేదీన ప్రారంభించారు. తొలుత స్కూల్ అసిస్టెంట్ల సర్దుబాటు పూర్తిచేసి ఉత్తర్వులు జారీ చేయడంతో వారంతా 25వ తేదీన తమకు కేటాయించిన పాఠశాలలకు వెళ్లి విధుల్లో చేరారు. ఇంకా ఎస్‌జీటీలను సర్దుబాటు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా తుది దశకు చేరింది. ఇదే సమయంలో ఉపాధ్యాయుల పదోన్నతులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. సర్దుబాటు ఇప్పుడు చేస్తారా, పదోన్నతుల తర్వాత ఉంటుందా? అనే అంశంపై ఉపాధ్యాయ వర్గాల్లో సందిగ్ధం నెలకొంది.

టీచర్లకు పదోన్నతులు!

టీచర్లకు పదోన్నతులు!