
దుకాణాల పైకి దూసుకెళ్లిన ట్రాక్టర్
ఫ మహిళకు తీవ్ర గాయాలు
ఆలేరు: డ్రైవర్ మద్యం మత్తులో ట్రాక్టర్ నడపడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆలేరు పట్టణంలో శుక్రవారం జరిగింది. ఎస్‌ఐ వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పట్టణంలోని పెద్దవాగు నుంచి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇసుక తరలించేందుకు జూకంటి సంపత్ ట్రాక్టర్‌కు తహసీల్దార్ ఆంజనేయులు పర్మిషన్ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం డ్రైవర్ కమల్‌హాసన్ వాగు వద్ద ట్రాక్టర్‌లో ఇసుక లోడ్ చేసుకుని కనకదుర్గ గుడి మార్గంలో ఆర్టీసీ బస్టాండ్ వైపు వెళ్తున్నాడు. ఆర్‌కే సినిమా థియేటర్ వెళ్లే దారి సమీపంలోకి రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న శ్రీలక్ష్మీనర్సింహ ఉడెన్ ఫర్నీచర్ వర్క్స్‌షాప్ పైకి దూసుకెళ్లింది. దీంతో షాపులోని వర్కర్లు బయటకు పరుగులు తీశారు. అదే సమయంలో బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న కొలనుపాకకు చెందిన వల్లెపు రాజమణిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఫర్నీచర్ షాపు ఎదుట పార్కింగ్ చేసిన స్కూటీ నుజ్జునుజ్జయ్యింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన మహిళను ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. డ్రైవర్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్‌ఐ తెలిపారు. ట్రాక్టర్‌ను సీజ్ చేసి, డ్రైవర్‌ను అరెస్టు చేశామని పేర్కొన్నారు. అయితే ఆలేరు నుంచి జనగామ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు రాంగ్‌రూట్‌లో ఎదురుగా రావడంతో అతడిని తప్పించే క్రమంలోనే ట్రాక్టర్ దుకాణాల పైకి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.