పత్తి రైతుపై విత్తన భారం! | - | Sakshi
Sakshi News home page

పత్తి రైతుపై విత్తన భారం!

May 22 2025 5:53 AM | Updated on May 22 2025 5:53 AM

పత్తి

పత్తి రైతుపై విత్తన భారం!

సంస్థాన్‌ నారాయణపురం: పత్తి విత్తనాల ధర మళ్లీ పెరిగింది. గతేడాది రూ.864 ఉన్న ప్యాకెట్‌ ధర రూ.37 పెరిగి రూ.901కి చేరింది. ఫలితంగా ఏటా పెరిగిపోతున్న ఖర్చులతో సేద్యం భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీటీ పత్తి విత్తనాల రేట్లు మూడేళ్లుగా పెరుగుతూ వస్తున్నాయి.

మూడేళ్లుగా పెరుగుతున్న రేట్లు

2022లో పత్తి విత్తనాల ప్యాకెట్‌ (450 గ్రా) ధర రూ.767 ఉండగా 2023లో రూ.43 పెరిగి రూ.810కి చేరింది. 2024లో రూ.853కు పెరిగింది. ప్రస్తుతం 901కి చేరింది. ఏటా విత్తన రేట్లు పెరుగుతుండడంతో కొనుగోలు చేయడం రైతులకు తలకుమించిన భారంగా మారింది.

2.30లక్షల ప్యాకెట్‌ల విత్తనాలు అవసరం

వానాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 1.15లక్షల ఎకరాల్లో పత్తి సాగు కానుందని, ఇందుకు గాను 2.30లక్షల ప్యాకెట్‌ల విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ, చాలా మంది రై తులు ఎకరానికి రెండుమూడు ప్యాకెట్‌ల వరకు వి త్తనాలు విత్తుతుంటారు. మొలకెత్తకపోతే అదనంగా మ రికొన్ని ప్యాకెట్‌లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన పెరిగిన ధరలతో జిల్లా రైతులపై సు మారు రూ.1.30 కోట్లు అదనపుభారం పడనుంది.

ముందుస్తుగానే విత్తనాల కొనుగోలు

గత ఏడాది కంపెనీ, బ్రాండెడ్‌ విత్తనాల కొరత ఏర్పడింది. దీంతో చాలా మంది రైతులు ఎమ్మార్పీ రేటు కంటే ఎక్కువ చెల్లించి తక్కువ నాణ్యత కల్గిన విత్తనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది అనుభవాల దృష్ట్యా ఈసారి చాలా మంది రైతులు ముందస్తుగానే విత్తనాలు కొనుగోలు చేశారు. హైదరాబాద్‌, నల్లగొండ, చౌటుప్పల్‌, భువనగిరి మునుగోడు, చండూరు, మిర్యాలగూడ, దామరచర్ల, మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ తదితర ప్రాంతాల్లో పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.

ప్యాకెట్‌పై రూ.37 పెంపు

ఫ రూ.864 నుంచి రూ.901కి చేరిన ధర

ఫ జిల్లా రైతులపై రూ.1.30 కోట్ల భారం

ఫ 1.15 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా

ఫ 2.30 లక్షల ప్యాకెట్ల సీడ్‌ అవసరం

పత్తి సాగు పెరిగే అవకాశం

ఈసారి పత్తి సాగు పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. 1.15లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేసినప్పటికీ, మరో 20వేల ఎకరాల్లో సాగు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నెల 25నుంచి రోహిణి కార్తె ప్రవేశిస్తుడటం, ముందుస్తుగానే రుతుపవనాలు రానున్నాయన్న వాతావరణ శాఖ ప్రకటనతో రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. వర్షం కురుస్తుందన్న అశాభావంతో కొంతమంది రైతులు ఇప్పటికే విత్తనాలు విత్తారు.

రాయితీ ఇవ్వాలి

ఏటేటా పత్తి విత్తనాల రేట్లు పెరుగుతుండడం రైతులకు సేద్యం భారంగా మారుతోంది. ఇప్పటికే పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. విత్తన ధరల పెంపుతో ఆర్థిక భారం పడుతుంది. రైతులను ప్రోత్సహించడానికి పత్తి విత్తనాలను రాయితీపై విక్రయించాలి. లేనిపక్షంలో నష్టాలపాలవుతాం.

–ఐతరాజు యాదయ్య,

రైతు, సంస్థాన్‌ నారాయణపురం

పత్తి రైతుపై విత్తన భారం! 1
1/1

పత్తి రైతుపై విత్తన భారం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement