పంట మార్పిడితో అధిక దిగుబడులు
● మిపర, క్యాబేజీ పంటలకు ఆశించే లద్దె పురుగుల తాకిడి తగ్గాలంటే జొన్న, వరి, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు, వంటి ఆరుతడి పంటలతో పంట మార్పిడి చేయాలి.
● వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాల ఆధారంగా పంట మార్పిడి చేయాలి.
● భూసార పరీక్షల ఆధారంగా పంటలకు ఎరువులు వేయడం ఉత్తమం.
త్రిపురారం : ప్రతి సీజన్‌లో ఒకే పంట కాకుండా పంట మార్పిడి చేయడం వల్ల భూసారం పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం కంపాసాగర్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసరావు సూచిస్తున్నారు. ఒకే పంటను ఏళ్ల తరబడి సాగు చేయడం ద్వారా చీడపీడల తాకిడి అధికమవుతుందని, భూమి నిస్సారంగా మారుతుందని చెబుతున్నారు. పంట మార్పిడిపై సలహాలు సూచనలు ఆయన మాటల్లోనే..
ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి
పంట మార్పిడి చేయాలంటే అంతకు ముందు సాగు చేసిన పంటకు భిన్నంగా పంటను ఎంచుకోవాలి. కొన్ని పంటల వేరు వ్యవస్థ నేలలోని పొరల నుంచి పోషకాలను ఎక్కువగా గ్రహిస్తాయి. పోషకాలను ఎక్కువగా గ్రహించే నువ్వులు, పొద్దుతిరుగుడు, మొక్క జొన్న పంటలకు బదులుగా భూమికి పోషకాలు సమకూర్చే అపరాల పంటలను సాగు చేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. అపరాల పంటలు కరువు పరిస్థితులను తట్టుకోవడంతోపాటు ఆకులు రాలడం వల్ల భూమికి సేంద్రియ పదార్థాలు అందుతాయి. రాలిన ఆకులను నేలలో కలియదున్నడం వల్ల భూమి సారవంతంగా మారుతుంది. నల్ల రేగడి నేలల్లో సోయా చిక్కుడు వేసుకోవడం వల్ల పైరు కోత సమయానికి ఆకులు పూర్తిగా రాలుతాయి. దీనివల్ల ఒక్కటి నుంచి రెండు టన్నుల సేంద్రీయ పదార్థం లభిస్తుంది.
పంట మార్పిడి ఇలా చేసుకోవచ్చు..
● వరి పంటను వరుసగా సాగు చేయకుండా పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలు కూడా సాగు చేసుకోవచ్చు.
● పొద్దు తిరుగుడు పంటను సాగు చేసే వారు జొన్న, సజ్జ, కొర్రలు వంటి చిరు ధాన్యపు పంటలను లేదా కంది, శనగ, మినుము వంటి అపరాల పైర్లు లేదా వేరుశనగతో పంట మార్పిడి చేసుకోవచ్చు.
● వానాకాలంలో వేరుశనగ వేసుకునే రైతులు తరువాత వచ్చే యాసంగిలో మొక్కజొన్న పంట వేసుకుంటే పైరుకు కొంత నత్రజని ఎరువు లభిస్తుంది.
● కంది, శనగ పంటలను వరుసగా సాగు చేస్తే కాయ తొలుచు పురుగు అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ పురుగులు తక్కువగా ఆశించే జొన్న, నువ్వులు, మినుము, సోయా చిక్కుడు, ఉలవ, మెట్ట వరి పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి.
● వరితో పంట మార్పిడి చేసుకుంటే వేరు శనగ పైరుకు నులిపురుగుల బెడద తగ్గుతుంది.
● వంగ తోట వేసుకునే రైతులు కాలీఫ్లవర్‌తో పంట మార్పిడి చేసుకుంటే పంటకు ఎండు తెగులు సోకదు.
● టమాట, ఆవాలు, బంతి ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేస్తే నులిపురుగుల ఉధృతి తగ్గుతుంది.
● దోస, కాకర, గుమ్మడి పొట్లకాయ, బీర, బూడిద, గుమ్మడి, దొండ వంటి తీగ జాతి కూరగాయల పంటలను వరి పైరుతో పంట మార్పిడి చేసుకోవచ్చు.
● ఉల్లి సాగు చేసేవారు ధాన్యపు పంటలలో పంట మార్పిడి చేసుకోవచ్చు.
● ఒక్కసారి పసుపు పంట సాగు చేసిన వారు రెండేళ్ల పాటు ఆ భూమిలో మరోసారి పసుపు సాగు చేయకూడదు. ఒకవేళ సాగు చేస్తే చీడపీడల ఉధృతి పెరిగి దిగుబడులు తగ్గుతాయి. పసుసు పంట తర్వాత వరి, మొక్క జొన్న వేసుకుంటే నులి పురుగుల ఉధృతి తగ్గుతుంది.
కంపాసాగర్ కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాసరావు సూచనలు
పంట మార్పిడితో అధిక దిగుబడులు
పంట మార్పిడితో అధిక దిగుబడులు


