సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసు వ్యవస్థ గాడి తప్పుతుంది. పోలీస్ ట్రీట్‌మెంట్ పేరుతో కొందరు ఎస్సైలు, సీఐలు తరుచూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. చిన్నపాటి కేసుల్లో ఇష్టానుసారంగా చితకబాదిన ఘటనలు జిల్లాలో అనేకం ఉన్నాయి. పొలిటికల్ అండతో పోస్టింగులు వేయించుకుని ఏకపక్షంగా వ్యవహరిస్తూ తరుచూ కొందరు విచారణలు ఎదుర్కొంటుండగా మరికొందరు వీఆర్‌లో ఉంటున్నారు. గత ఏడాది కాలంలో జిల్లాలో పోలీసుల వేధింపులతో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకోగా ఏలూరులో మైనర్ బాలుడిని పోలీసులే కొట్టి చంపారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్ సంఘటనతో ఉమ్మడి జిల్లా పోలీసుల తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ప్రజా ప్రతినిధుల అండతో అత్యుత్సాహం
మైనర్ బాలుడిపై దాడి, దొంగతనం కేసులో యువకుడిని స్టేషన్‌కు తీసుకురావడం, ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో విచారించకుండా ఇష్టానుసారంగా కొట్టడంతో పశ్చిమ పోలీసుల వైఖరి వివాదాస్పదంగా మారింది. పూర్తిగా కూటమి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పోస్టింగులు దక్కించుకుంటున్న ఎస్సైలు, సీఐలు ప్రజాప్రతినిధులు చెబితే అడ్డగోలుగా అత్యుత్సాహం చూపుతున్నారు. సమస్య వస్తే ప్రజాప్రతినిధే చూసుకుంటారనే రీతిలో వ్యవహరిస్తూ కొందరు సీఐలు వివాదాస్పదంగా మారుతున్నారు. గతేడాది మార్చిలో ఏలూరు చేపలతూము ప్రాంతానికి చెందిన బంగారు యశ్వంత్ బైక్ దొంగతనం చేశాడనే అభియోగంతో ఏలూరు సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత రెండు రోజులకు ఒంటిపై గాయాలతో మార్చురీలో శవమై తేలాడు. అధికార పార్టీ నేతలు రంగ ప్రవేశం చేసి హడావుడి చేయడంతో పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు వచ్చినా జిల్లా అధికారులందరికీ తెలిసే సంఘటన జరగడంతో వ్యవహారం పూర్తి స్థాయిలో వెలుగులోకి రాని పరిస్థితి. అలాగే కొద్ది నెలల క్రితం బుట్టాయగూడెం ఎస్సై దుర్గా ప్రసాద్ జంగారెడ్డిగూడెంకు చెందిన అఖిల్ అనే యువకుడిని రెడ్డిగణపవరంలో జరిగిన తిరునాళ్ళ వద్ద పోలీస్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఈ ఘటనలో అఖిల్ చేతులు విరగడంతో యువకుడి బంధువులు ఎస్పీకి ఫిర్యాదు చేయగా.. ఎస్సైను వీఆర్‌కు పంపి వ్యవహారాన్ని ముగించేశారు.
ఉమ్మడి జిల్లాలో ఖాకీల పనితీరుపై వివాదం
ఆకివీడు, నిడమర్రులో పోలీసుల వేధింపులకు యువకుల ఆత్మహత్య
బుట్టాయగూడెంలో యువకుడి చేయి విరగ్గొట్టిన ఎస్సై
జిల్లాలో తరచూ ఈ తరహా ఘటనలు
గతేడాది ఏలూరులో బాలుడిని కొట్టి చంపారని అభియోగం


