● కారుమూరి సునీల్ కుమార్ అరెస్టుపై ఆగ్రహ జ్వాలలు
కాళ్ల: ఓటు బ్యాంకుగా వాడుకుని బీసీలను అణగదొక్కడమే లక్ష్యంగా కూటమి పాలన సాగుతుందని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కారుమూరి సునీల్ అరెస్టుకు నిరసనగా కాళ్ల మండలం పెద అమిరం పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి అనుకూలంగా పాలన చేయనప్పుడు ప్రతిపక్షం గొంతు విప్పుతుందన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కనపెట్టి ఎన్ని దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమ అరెస్టులు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నాయకులు చాలామందిని అరెస్టు చేసి ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కారుమూరి సునీల్ కూడా అరెస్ట్ చేయడం చాలా దారుణం అని అన్నారు. బీసీలను ఓటు హక్కుగా భావించడం తప్ప చంద్రబాబు నాయుడు బీసీలకు చేసింది ఏమీ లేదని గుర్తు చేశారు. బీసీలంతా ఆలోచించాలని గత పాలనకు ప్రస్తుత పాలనకు తేడా గమనించాలని కోరారు. గత ప్రభుత్వంలో జగన్‌మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేశారని చేయూత పేరుతో బీసీ మహిళలకు ఎంతో సాయం చేశారని గుర్తు చేశారు. పార్టీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కొండేటి శివకుమార్, బీసీ నాయకులు గేదెల అప్పారావు, బడుగు బాలాజీ, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు పెనుమత్స దుర్గాప్రసాద్ రాజు, ఆకివీడు మండల పార్టీ అధ్యక్షులు నంద్యాల సీతారామయ్య మాట్లాడుతూ ఏ తప్పు చేయకపోయినా కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసి ఆయన కుమారుడు సునీల్‌ను అక్రమ అరెస్టు చేయటం సరి కాదన్నారు. బీసీలను ఎంత అణగదొక్కాలని చూస్తే అంత వేగంగా బీసీలు అంత ఏకమై కూటమి ప్రభుత్వాన్ని కూల్చడానికి ఉద్యమం చేస్తామన్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ మద్యం కుంభకోణం జరిగిందని సాకు చూపుతూ బీసీలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని వాపోయారు. కార్యక్రమంలో కాళ్ళ, ఉండి మండల పార్టీ అధ్యక్షులు గణేశ్న రాంబాబు, పెనుమత్స ఆంజనేయరాజు, గుండు నాగేశ్వరరావు, చేకూరి నరేంద్ర రాజు, బీసీ నాయకులు కట్ట వెంకటరావు, గోళ్ళ ప్రభాకర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


