పోలీస్‌ పిల్లల భవిష్యత్‌కు బాసట | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ పిల్లల భవిష్యత్‌కు బాసట

Jun 21 2026 8:10 AM | Updated on Jun 21 2026 8:10 AM

పోలీస్‌ పిల్లల భవిష్యత్‌కు బాసట ద్వారకాతిరుమలలో భక్తుల రద్దీ చికిత్స పొందుతూ ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ మృతి విద్యార్థులను తరలించడంలో నిర్లక్ష్యం సహించం

ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లా పోలీస్‌ సిబ్బంది పిల్లల ఉన్నత భవితకు బాటలు వేస్తూ విద్యలో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ చేతులమీదుగా మెరిట్‌ స్కాలర్‌షిప్‌ అందజేశారు. 2025–26 విద్యాసంవత్సరానికి గానూ మినిస్టీరియల్‌ స్టాఫ్‌, పోలీస్‌ సిబ్బంది, హోంగార్డు పిల్లలు 61మంది విద్యార్థులకు రూ.5.31 లక్షల నగదు బహుమతులు అందజేశారు. పదవ తరగతి, ఇంటర్మీడియెట్‌, డిగ్రీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి ప్రత్యేకంగా ఆహ్వానించి, నగదు బహుమతులు అందజేయటంతోపాటు అభినందించారు. పోలీస్‌ ప్రధాన కార్యాలయ సూపరింటెండెంట్‌ నాగేశ్వరరావు, ఏఆర్‌ డీఎస్పీ చంద్రశేఖర్‌, ఆర్‌ఐ పవన్‌కుమార్‌, ఆర్‌ఎస్‌ఐలు వెంకటేష్‌, అమరేశ్వరరావు, పోలీస్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్‌.నాగేశ్వరరావు, పోలీస్‌ అధికారులు, సిబ్బంది, హోంగార్డులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు.

ద్వారకాతిరుమల: చినవెంకన్న ఆలయం శనివారం భక్తులతో పోటెత్తింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. ఉదయం నుంచే ఆలయంలో దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రాంగణం, దర్శనం క్యూలైన్లు, ప్రసాదాలు విక్రయ కేంద్రాలు, అన్నదాన సదనం, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో రద్దీగా మారాయి. అయితే గత వారంతో పోలిస్తే ఈ వారం భక్తుల రద్దీ కొంత మేర తగ్గింది. వేసవి సెలవులు ముగియడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య తగ్గడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయినప్పటికీ శనివారం కావడంతో భక్తుల రాకపోకలు అధికంగానే కొనసాగాయి. దాంతో క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

పెదపాడు: ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన పెదపాడు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపూరు గ్రామానికి చెందిన పామర్తి శ్రీనివాసరావు ఇంటికి 19వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. సరిచేసేందుకు లైన్‌మ్యాన్‌ కరంగుల నాగేశ్వరరావుతో కలిసి మనురాజు సూరిబాబు (48) వెళ్లాడు. విద్యుత్‌ మరమ్మతుల్లో భాగంగా నిచ్చెన సహాయంతో విద్యుత్‌ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా సూరిబాబు నిచ్చెనపైనుంచి కింద పడి తలకు గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి అనంతరం మెరుగైన వైద్యపరీక్షల నిమిత్తం ఆంధ్రా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సూరిబాబు మృతి చెందాడు. అతడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై ఆర్‌ శ్రీను కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థులను తరలించే సమయంలో డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని మోటార్‌ వెహికల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌డీ విఠల్‌ అన్నారు. ఏలూరు డీటీసీ కార్యాలయంలో ఉప రవాణా కమిషనర్‌ షేక్‌ కరీమ్‌ ఆదేశాల మేరకు శనివారం నగరంలోని పాసింజర్‌ ఆటో యూనియన్‌ డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఆటోల్లో విద్యార్థులను పరిమితికి మించి తరలించి, పిల్లల ప్రాణాలతో చెలగాటమాడటం చట్టవిరుద్ధమని, అటువంటి డ్రైవర్లపై కేసులు నమోదు చేయడంతో పాటుగా ఆటోను సీజ్‌ చేస్తామని విఠల్‌ హెచ్చరించారు. మరమ్మతులు ఉన్న ఆటోల్లో విద్యార్థులను తరలించవద్దని, డ్రైవర్‌ ఇరువైపులా ఎవరిని అనుమతించరాదని, మరీ ముఖ్యంగా డ్రైవర్లు మద్యం సేవించి వాహనం నడపరాదన్నారు. ప్రతి ఆటో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలని, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోవడం, యూనిఫాం ధరించకపోవడం, రహదారి భద్రతా నియమాలను పాటించకపోవడం నేరమన్నారు. సమావేశంలో వాహన తనిఖీ అధికారులు, ఎన్‌.నెహ్రు, డీ.ప్రజ్ఞ, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement