టీడీపీ సంబరాలు.. ప్రజలకు అవస్థలు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ సంబరాలు.. ప్రజలకు అవస్థలు

Jun 21 2026 8:10 AM | Updated on Jun 21 2026 8:10 AM

నూజివీడు: కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవ సంబరాలు, అన్నదాత సుఖీభవ కార్యక్రమం కలిపి పట్టణంలోని చిన్నగాంధీబొమ్మ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చిన్నగాంధీబొమ్మ సెంటర్‌లో కార్యక్రమం స్టేజీ నిమిత్తం ఉదయం 9గంటల నుంచే ఆయిల్‌పామ్‌ గెలలు తొలే ట్రాక్టర్‌ ట్రక్కును రోడ్డుపై ఉంచడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులతో వాహనదారులు, ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. ఉదయం నుంచి రాత్రి సభ కార్యక్రమం పూర్తయ్యే వరకు ప్రజలకు చుక్కలు కనిపించాయి. అసలే ఇరుకు రహదారులతో ఇబ్బందులు పడుతుంటే బహిరంగ సభ చిన్నగాంధీబొమ్మ సెంటర్‌లో ఏర్పాటు చేయడమేమిటనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపించాయి. మార్కెట్‌యార్డు ఆవరణలోనో, ఎంపీడీవో కార్యాలయం వద్దో, జంక్షన్‌ రోడ్డులోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోనో ఏర్పాటు చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండేది కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. దీనికి తోడు రైతు బజారు రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్‌ ట్రక్కును ఏర్పాటు చేయడంతో కూరగాయల కోసం మహిళలు, వృద్ధులు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

బస్సుల మళ్లింపు

విస్సన్నపేట నుంచి విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సులను, మైలవరం, హనుమాన్‌ జంక్షన్‌ వైపు నుంచి వచ్చే గొల్లపల్లి, పోలసానపల్లి, వట్టిగుడిపాడు, రామన్నగూడెంల మీదుగా నూజివీడు బస్టాండుకు మళ్లించారు. బస్టాండులో దిగిన ప్రజలు తమ ఇళ్లకు చేరుకోవడానికి సైతం ఇబ్బందులు పడ్డారు. ఇలా మళ్లించడం వల్ల బస్సులు దాదాపు 20 కిలోమీటర్ల దూరం అదనంగా తిరిగి రావాల్సి వచ్చింది. పెట్రోలు, డీజిల్‌లను వృథా చేయొద్దు.. పొదుపు చేయాలని ప్రధాని మోడీ పిలుపునిస్తే దానికి విరుద్ధంగా 20 కిలోమీటర్ల దూరం తిరిగి రావడంతో పొదుపు చేయడమంటే ఇదేనా అనే విమర్శలు ప్రజల్లో వినిపించాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement