పొగాకు రైతులూ.. మోసపోవద్దు | - | Sakshi
Sakshi News home page

పొగాకు రైతులూ.. మోసపోవద్దు

Jun 21 2026 8:10 AM | Updated on Jun 21 2026 8:10 AM

జంగారెడ్డిగూడెం: పొగాకు కంపెనీల మాటలు విని మోసపోవద్దని పొగాకు బోర్డ్‌ చైర్మన్‌ యశ్వంత్‌ కుమార్‌ రైతులకు సూచించారు. శనివారం పట్టణంలోని రెండు పొగాకు వేలం కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల పొగాకుకు కంపెనీల ప్రతినిధులు ఏ విధంగా ధర ఇస్తున్నారని స్వయంగా పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు రైతులు వారి సమస్యలను విన్నవించారు. గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ బిడ్డలను చదివించుకోవడానికి, కుటుంబ ఖర్చుల నిమిత్తం కూడా ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు వివరించారు. రైతు సంఘం నాయకులు సత్రం లక్ష్మణరావు, కరాటం రెడ్డి బాబు, పరిమి రాంబాబు, రైతులు తరఫున పలు విషయాలను చైర్మన్‌ దృష్టికి తీసుకువెళ్లారు. రానున్న అక్టోబర్‌ నెలలో పొగాకు నాట్లు వేయడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. గత మూడు నెలలుగా జరుగుతున్న వేలంలో కనీస గిట్టుబాటు ధర లేదన్నారు.

గిట్టుబాటు ధర ఇవ్వకుంటే కరెంట్‌ కట్‌

అనంతరం పొగాకు బోర్డ్‌ చైర్మన్‌ యశ్వంత్‌ కుమార్‌ మాట్లాడుతూ రైతుల పక్షాన పొగాకు బోర్డు పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న రూ.255 ధరను రూ.300కు పెంచడానికి పొగాకు బోర్డు రైతులతో కలిసి కృషి చేస్తుందన్నారు. రానున్న సోమవారం నుంచి రైతులు తమ పొగాకును వేలం కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. టాక్స్‌ల పేరుతో పొగాకు కంపెనీలు పొగాకు కొనడం లేదని నిజానికి వాటితో మాకు సంబంధం ఏంటి అని ప్రశ్నించారు. పొగాకు కంపెనీలు రైతులకు న్యాయమైన గిట్టుబాటు ధర ఇవ్వకపోతే వారి ఫ్యాక్టరీలలో కరెంటు కూడా కట్‌ చేస్తామన్నారు. పొగాకు బోర్డు రైతులు బాగోగులు పట్టించుకుంటుందని రైతులు పొగాకు బోర్డు కలిసి ప్రస్తుత ఒడిదుడుకులు ఎదుర్కోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా 320 మిలియన్‌ వర్జినియా పొగాకులో 30 శాతమే సిగరెట్లు తయారీకి ఉపయోగిస్తున్నారని, మిగిలిన 70 శాతం ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారని అన్నారు. ఇక ఊరుకునేది లేదని తాడోపేడో తేల్చుకుందామన్నారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు ఆర్‌ ఎం జై సురేంద్ర కుమార్‌, గ్రేస్‌ మార్గరెట్‌ రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement