విత్తన శుద్ధితో పంటకు రక్షణ
● ఉమ్మడి పశ్చిమగోదావరిలో 5.40 లక్షల ఎకరాల్లో వరి సాగు
● విత్తన సేకరణ, శుద్ధి పట్ల అప్రమత్తత అవసరం
భీమవరం : సార్వా వరి నారుమడి పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. గత సార్వా పంట సమయంలో మోంథా తుఫానుకు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి సహాయం అందకపోయినా, వ్యవసాయమే జీవనాధారమైన రైతన్నలు ప్రస్తుత సార్వా సాగుకు సన్నద్ధమవుతున్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఇస్తామన్న ‘అన్నదాత సుఖీభవ’ నిధులు నేటికీ జమకాకపోయినా... అప్పులు చేసి మరీ రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తూ, దుక్కులు దున్నుతూ వరి నారుమళ్లు వేస్తున్నారు. వరిసాగులో విత్తన ఎంపిక, విత్తనశుద్ధి, సస్యరక్షణపై రైతులు దృష్టి పెట్టాలని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు.
పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో సుమారు 5.40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరిసాగు చేయనున్నారు. దీనిలో పశ్చిమగోదావరి జిల్లాలో 2.35 లక్షల ఎకరాలు, ఏలూరు జిల్లాలో సుమారు 3 లక్షల ఎకరాలు ఉన్నాయి. వరి నారుమళ్లు వేయడానికి ఎకరాకు 30 కిలోల వరకు విత్తనాలు అవసరమవుతాయి.
విత్తన సేకరణ ఇలా..
● పురుగులు, తెగుళ్లు ఆశించని పొలం నుంచి విత్తనాన్ని సేకరించుకోవాలి. రైతులు తమ సొంత విత్తనాన్నే వాడుకుంటుంటే... పంట కోత కోసిన తరువాత విత్తనాలతో పాటు కలిసిపోయిన మట్టి, శిలీంధ్ర బీజాలు, పురుగు గుడ్లను (తుట్టెలను) తీసివేసి, శుభ్రం చేసి నిల్వ చేసుకోవాలి. బయట విత్తనాన్ని కొనుగోలు చేసే సమయంలో విత్తన శుద్ధి చేశారో లేదో నిర్ధారించుకోవాలి. కొనుగోలు చేసిన విత్తనానికి సంబంధించిన బిల్లును తప్పనిసరిగా తీసుకోవాలి. కొనుగోలు చేసిన విత్తనాల మొలక శాతాన్ని తప్పనిసరిగా పరీక్షించుకోవాలి.
నాణ్యమైన విత్తనమే అయినా..
● ఎక్కువ మంది రైతులు సొంతంగా విత్తనాలను పండించుకోవడం లేదా తోటి రైతుల నుంచి విత్తనాలను కొనుగోలు చేయడం చేస్తుంటారు. విత్తనాలతో పాటు కొన్ని తెగుళ్లను కలుగజేసే శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్ వంటివి పంటలను ఆశించి తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో నాణ్యమైన విత్తనం అయినప్పటికీ భూమి నుంచి, వివిధ రకాల పురుగుల నుంచి తెగుళ్లు ఆశించి పంటను నష్టపరుస్తూ ఉంటాయి.
● అందువల్ల పంటను తొలిదశలోనే రక్షించుకోవడానికి సిఫారసు చేసిన శిలీంధ్ర నాశినులతో గాని, పురుగు మందులు లేదా జీవ శిలీంధ్ర నాశినులతో తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి మందులు పొడి, ద్రవ రూపంలో, కాన్సంట్రేట్స్ రూపంలో మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి.
విత్తన శుద్ధికి పద్ధతులు
● పొడి విత్తన శుద్ధి : డ్రమ్ములో మూడింట రెండొంతులు విత్తనాలు వేసి, సిఫార్సు చేసిన మోతాదులో మందు కలిపి బాగా తిప్పితే విత్తనానికి మందు పట్టుకుంటుంది. కొన్ని రకాల విత్తనాలకు జిగురు, బెల్లం ద్రావణం, చిక్కటి గంజి ద్రావణం వంటివి కలపడం వల్ల మందు బాగా పట్టుకుంటుంది. ఇది విత్తనానికి ఒక రక్షణ కవచంగా ఏర్పడి చీడపీడల నివారణకు తోడ్పడుతుంది.
● తడి విత్తన శుద్ధి : ముఖ్యంగా వరి విత్తన శుద్ధికి తగినంత నీటిని తీసుకుని, ఆ నీటిలో సిఫార్సు చేసిన మందులు కలుపుకొని విత్తనాలను నానబెట్టుకోవాలి. దీని ద్వారా చీడపీడల నుంచి పంటలను రక్షించుకోవచ్చు.
● జీవ శిలీంధ్ర నాశినులతో : కొన్ని రకాల జీవ శిలీంధ్ర నాశినులైన ట్రైకోడెర్మా విరిడి, ట్రైకోడెర్మా హార్జియానం, సూడోమోనాస్ వంటి వాటితో విత్తన శుద్ధి చేయడం చాలా మంచిది. ఇవి తమ సంతతిని భూమిలోనే అభివృద్ధి చేసుకుని, తెగుళ్లను కలుగజేసే హానికర శిలీంధ్రాలను నాశనం చేయడమే గాక పంట చివరి వరకు రక్షణ కల్పిస్తాయి. ఈ మందులు భూమిలోనే వృద్ధి చెంది, ఆ తర్వాత వేసే పంటలకు కూడా ఉపయోగపడతాయి. వీటి మోతాదు కిలో విత్తనానికి 8 నుంచి 30 గ్రాముల వరకు వాడుకోవాలి.
వరిసాగులో విత్తనశుద్ధి ద్వారా పురుగుమందుల ఖర్చు తగ్గడమే కాకుండా పంటలో అధిక దిగుబడులు సాధించవచ్చు. సార్వా సాగుకు సిద్ధమవుతున్న రైతులు తప్పనిసరిగా విత్తనశుద్ధిపై దృష్టి పెట్టాలి. విత్తనశుద్ధికి అవసరమైన సమాచారం కోసం అందుబాటులో ఉన్న వ్యవసాయశాఖాధికారులను సంప్రదించాలి.
– జె. వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి


