అసంపూర్తిగా నిర్మాణాలు
● చంద్రబాబు ప్రభుత్వం రాకతో నిలిచిన పనులు
● అసంపూర్తిగా పాఠశాలల భవన నిర్మాణాలు
భీమవరం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేసింది. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు మనబడి, నాడు – నేడు పేరిట అభివృద్ధి పనులు చేపట్టింది. అనంతరం ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టడంతో పాఠశాలల అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయినా నేటికీ ఆ పనులు పూర్తిచేయడం లేదు. దీంతో అంసపూర్తిగా నిలిచిన పాఠశాలల భవనాలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జగన్ హయాంలో కార్పొరేట్‌కు దీటుగా..
జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 1,399 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 90 వేలకు పైగా విద్యార్థులు విధ్యనభ్యసిస్తున్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు లేకపోవడంతో పేదలు సైతం ఆర్థిక స్థోమత లేకపోయినా తమ పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించక తప్పేదికాదు. 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన తరువాత ప్రభుత్వ పాఠశాలలపై దృష్టిపెట్టి మనబడి, నాడు–నేడు పథకంతో ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించడమేగాక ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి విద్యార్థులకు ట్యాబ్‌లు, పాఠశాలల్లో డిజిటల్ బోధన అమలు చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు మళ్లీ ఆసక్తి పెరిగింది. అనేక ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్ల వద్ద నో వేకెన్సీ బోర్డులు దర్శనమిచ్చాయి. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు విద్యార్థులకు ఎంతగానో దోహదపడడంతో పేద విద్యార్థులు సైతం ఉన్నత విద్యనభ్యసించి మంచి ఉద్యోగాలు సాధించారు.
జిల్లాలోని 254 పాఠశాలల భవనాల మరమ్మతులు చేపడుతున్నాం. పెచ్చులూడిన శ్లాబ్‌ల మరమ్మతులు, గోడల నిర్మాణం వంటి పనులకు సుమారు రూ.9 కోట్లతో పనులు చేపడతాం. అలాగే 158 పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.2.5 కోట్లు వ్యయానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వ అనుమతులు రాగానే పనులు పూర్తిచేయిస్తాం.
– పి శ్యామ్‌సుందర్, జిల్లా సమగ్రశిక్షా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్, భీమవరం
వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ అధునీకరిస్తున్న సమయంలో 2024లో ప్రభుత్వం మారింది. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నాడు–నేడు పనులకు బ్రేక్ పడింది. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో కొన్ని భవనాలు పునాదుల్లోనే నిలిచిపోగా మరికొన్ని భవనాలు గోడలు నిర్మాణం, ప్లాస్టింగ్ పనులు పూర్తికాక నిరుపయోగం ఉన్నాయి. దీంతో జిల్లాలో దాదాపు 400 స్కూళ్లు అభివృద్ధికి నోచుకోకుండా మిగిలిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 254 స్కూళ్ల మరమ్మతులు, మరో 158 స్కూళ్లలో అదనపు తరగతి గదులు నిర్మాణం జరగాల్సి ఉంది. వీటికిగాను దాదాపు రూ.13 కోట్లు నిధులు అవసరం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలను త్వరితగతిని అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


