భీమవరం: జిల్లాలో ఖరీఫ్ సాగుకు పుష్కలంగా నీరందించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. భీమవరం కలెక్టరేట్‌లో గురువారం జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. సాగునీటి సరఫరాలో ఇబ్బందులు తొలగించాలని, మున్సిపల్ డ్రైనేజీ నీరు, ఇతర వ్యర్థాలు పంట కాలువల్లో కలవకుండా చూడాలన్నారు. సమావేశంలో భీమవరం ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కె.మురళీకృష్ణరాజు, వైస్ చైర్మన్ గుబ్బల మార్రాజు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.


