జీడి మామిడి.. జాగ్రత్తలతోనే అధిక దిగుబడి
దోమ నివారణ ఇలా..
చింతలపూడి: ఉమ్మడి ఏలూరు – పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించిన ఉన్న జీడితోటలు ప్రస్తుతం పూత దశలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జీడిమామిడి రైతులు పూత దశ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉద్యాన శాఖ అధికారిణి ఎండీ షాఫియ ఫర్‌హీన్ రైతులకు సూచనలు చేశారు. సాధారణంగా జీడి మామిడిలో పూత అక్టోబర్, నవంబర్ నెలల్లో మొదలై జనవరి, ఫిబ్రవరి వరకు వస్తుంది. జీడిచెట్టుకు వచ్చిన పూతలో సుమారు 200 నుంచి 800 వరకు పూలు పూస్తాయి. జీడిమామిడి చెట్లు పరాగ సంపర్కం వల్ల ఫలదీకరణ చెందుతాయి. ఈ చెట్లు పూతకు రావాలంటే సుమారు 25 రోజుల నుంచి 30 రోజులు పొడి వాతావరణం ఉండాలి. ఒకవేళ అక్టోబర్ నుంచి నవంబర్ వరకు వర్షాలు పడినట్లయితే పూత ఆలస్యమై రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే తెగుళ్ల తీవ్రత కూడా అధికం. జీడిమామిడి అంట్లు నాటిన రెండవ సంవత్సరం నుంచే పూత వస్తుంది. ఆ పూతను రైతులు తుంచివేసి చెట్ల శాఖలు పెరగడానికి ప్రోత్సహించాలి. దీనివల్ల చెట్లు బలంగా పెరిగి ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. వర్షాకాలంలో సిఫార్సు చేసిన ఎరువులు రెండు నుంచి మూడు సమ భాగాలుగా వేసుకోవాలి. ఐదు సంవత్సరాలు పైబడిన చెట్టుకు యూరియ 1.5 కేజీలు, సూపర్ ఫాస్ఫేట్ 650 గ్రాములు, పొటాష్ 1 కేజీ వేసుకోవాలి.
పూత దశలో తెగుళ్ల ఉధృతి
పూత దశలో మంచు ఎక్కువగా పడుతున్నప్పుడు పూత లోపల తేమ చేరి ఎండిన మగపూల వలన తామర పురుగులు లేదా తేయాకు దోమ ఉధృతి ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. జీడిమామిడిలో టి దోమ పూత దశ అంటే అక్టోబర్, నవంబర్ నెలలో మొదలవుతుంది. జనవరిలో ఎక్కువై లేత చిగుళ్లు, పూత, పూత కాడలను, చిన్న కాయలను ఆశించి రసం పీల్చడం ప్రారంభిస్తాయి. రసం పీల్చినప్పుడు ఒక రకమైన పదార్థం వదలడం వల్ల కాయలపై, చిగుర్లపై గజ్జిలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా పూత, చిగుర్లపై చేసిన రంధ్రాల వలన ఫ్లవర్ బైట్ అనే తెగులు కూడా వ్యాప్తి చెందుతుంది.
బూడిద తెగులుతో పూతకు నష్టం
పొడి వాతావరణం ఉన్నప్పుడు బూడిద తెగులు కూడా ఎక్కువగా పూతను నష్టపరిచి పూత రాలిపోయేలా చేస్తుంది. బూడిద తెగులు వల్ల లేత చిగుళ్లను, పూతను ఆశించి ఎండిపోయేలా చేసి పంటను నష్టపరుస్తుంది. దీని నివారణకు సల్ఫర్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా ట్రై డేమోర్ప్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఆకు, పూత, కాయమచ్చ తెగుళ్ల నివారణ
ఆకులపై చిన్న, చిన్న లేత ఆకుపచ్చ వర్ణంలో మచ్చలు ఏర్పడి క్రమేపీ మచ్చలు పెరుగుతూ మచ్చ మధ్య ఎండిపోయి చివరికి మొత్తం ఆకు ఎండి రాలిపోతుంది. పూత, పూత కాడలపై మచ్చలు వచ్చి పూత ఎండిపోయి రాలిపోతుంది. దీని నివారణకు రైతులు తొలుత తెగులు ఆశించిన కొమ్మలు తొలగించుకోవాలి. మంకోజెట్ 1 గ్రాము లీటరు నీటికి, లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి, లేదా క్లోరో తాలోనిల్ 1 మి.లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు.
ఎండీ షాఫియ ఫర్‌హీన్, ఉద్యాన శాఖ అధికారిణి
దోమ నివారణకు పూత మొదలై పువ్వు విచ్చుకోక ముందు ఒకసారి, పూలు ఫలదీకరణ చెందిన తరువాత రెండో సారి, టి దోమ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు (కాయ గోలీ సైజులో ఉన్నప్పుడు) మూడో సారి పిచికారీ చేయాలి. చెట్లు చిగురించినప్పుడు మొదట పిచికారీకి రైతులు ల్యాండా సైహాలో త్రిన్ 0.6 మిల్లీ లీటర్లు లీటరు నీటికి, లేదా అసిటామాప్రిడ్ 0.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే పూత కొమ్మలు కనిపించినప్పుడు రెండు, మూడు వారాల తరువాత ఇమిడాక్లోప్రిడ్ 0.6 మి.లీ లీటరు నీటికి లేదా ప్రొఫెనోఫాస్ 1.5 మి.లీ, లీటర్ నీటికి కలిపి రెండో సారి పిచికారీ చేయాలి. కాయలు గోలీ సైజులో ఉన్నప్పుడు ల్యాండా సైహాలో త్రిన్ 0.6 మిల్లీ లీటర్లు లీటర్ నీటికి లేదా ప్రొఫెనోఫాస్ 1.5 మి.లీ, లీటర్ నీటికి కలిపి మూడో సారి పిచికారీ చేయాలి. వీటితో పాటు వేపనూనెను తగిన మోతాదులో కలిపి వాడటం వలన మంచి ఫలితాలు వస్తాయి.
జీడి మామిడి.. జాగ్రత్తలతోనే అధిక దిగుబడి
జీడి మామిడి.. జాగ్రత్తలతోనే అధిక దిగుబడి


